కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజడ్) జీఎంఆర్ చేతి నుంచి అరబిందో రియాల్టీ, ఇన్ఫ్రా చేతికి చేరింది. 14 సంవత్సరాల కింద 10 వేల ఎకరాల్లో కాకినాడ సముద్ర తీరంలో ఏర్పాటైన కాకినాడ ఎస్ఈజడ్ లో పెద్దగా పరిశ్రమలు వచ్చింది లేదు. కేవలం చైనాకు చెందిన బొమ్మల తయారీ కంపెనీ ఒక్కటే ఉత్పత్తి ప్రారంభించింది. ఇన్నాళ్ల తరవాత కాకినాడ ఎస్ఈజడ్, అరబింతో చేతికి మారడంతో ఇకనైనా భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు.
అప్పుల భారం తగ్గించుకోవడానికేనట…
జీఎంఆర్ సంస్థ ఎయిర్ పోర్టులు, పోర్టులకే పరిమితం కావాలని నిర్ణయించుకుంది. అందుకే జీఎంఆర్ సంస్థకు మిగిలిన వ్యాపారాల్లో ఉన్న పెట్టుబడులను అమ్ముకుని అప్పుల భారం తగ్గించుకుంటోంది. విద్యుత్ రంగంలో, ఎస్ఈజడ్ లలో జీఎంఆర్ భారీ పెట్టుబడులు పెట్టింది. వీటి వల్ల పెద్దగా ఆదాయం లేకపోగా కంపెనీకి అప్పుల భారం పెంచాయి. జీఎంఆర్ సంస్థకు రూ.30000 కోట్ల అప్పులు ఉన్నాయి. కొన్ని వ్యాపారాలను అమ్ముకోవడం ద్వారా రుణభారం తగ్గించుకుంటున్నామని సంస్థ ప్రకటించింది. తాజాగా కాకినాడ సెజ్ లో 51 శాతం వాటా విక్రయం ద్వారా కంపెనీ రుణ భారం రూ.2600 కోట్లు తగ్గుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
కాకినాడ మేజర్ పోర్ట్ నిర్మాణంలో కదలిక వస్తుందా?
కాకినాడలో ప్రస్తుతం యాంకర్ పోర్టు మాత్రమే నడుస్తోంది. దీని వల్ల సరకు రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. సముద్రంలో దూరంగా లోతైన ప్రాంతంలో భారీ నౌకలు నిలపాల్సి వస్తోంది. భారీ నౌకలకు యాంకర్ల ద్వారా సరకు తీసుకువెళ్లి నింపాల్సి రావడంతో హ్యాండ్లింగ్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే కాకినాడలో ఓడరేవు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడ మేజర్ పోర్టు నిర్మాణం పూర్తయితే ఎస్ఈజడ్ లో భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా కాకినాడ పోర్టు పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రిలయన్సు ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు పెట్టనుందా?
కాకినాడ సెజ్ లో రిలయన్సు ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తోంది. గోదావరి బేసిన్ లో భారీగా గ్యాస్ నిల్వలు కనుగొన్నారు. వీటిని వెలికితీసి దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు రిలయన్సు భారీ పెట్టుబడులకు సిద్దంఅవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. ఇప్పటికే విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు గ్యాస్ కనెన్షన్లు ఇస్తూ, సరఫరా చేస్తున్నారు.
రాబోయే 2 సంవత్సరాల్లో హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక పట్టణాల్లో ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఏపీలో మెగా ఇంజనీరింగ్ చేపట్టింది. రూ.6000 కోట్ల ఈ ప్రాజెక్టు ద్వారా కోటి ఇళ్లకు గ్యాస్ సరఫరా చేయడంతోపాటు, పరిశ్రమలకు నేరుగా పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. అయితే ఇవన్నీ పట్టాలు ఎక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా కాకినాడ మేజర్ పోర్టు పూర్తయితే భారీ పెట్టుబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.











