తెలుగువారు ప్రపంచ నలుమూలలకు విస్తారయించారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ తో పాటు వివిధ రంగాలలో అనేక దేశాలలో తెలుగువారు రాణిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా వంటి అగ్రదేశాల్లోని చట్ట సభలలో కూడా మనవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ తెలుగు తేజం మెరిసింది.దివి తనూజ్ అనే యువకుడు విద్యార్ధి నాయకుడిగా ఆస్ట్రేలియా చట్ట సభల్లో అడుగుపెడుతున్నాడు.
వాస్తవానికి ప్రపంచంలోని అనేక దేశాలు చట్టసభల్లో విద్యార్థి రంగం నుంచి కూడా ప్రాతినిధ్యం కల్పిస్తోంది.వాటిలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. సామాజిక సేవపై ఆసక్తి చూపే విద్యార్థులు టీనేజిలోనే చట్టసభల్లో అడుగుపెడుతుంటారు. ఈ కోవలోనే ఏపీకి చెందిన దివి తనూజ్ చౌదరి ఆస్ట్రేలియా చట్టసభ సభ్యుడిగా నామినేట్ అయ్యాడు.
దివి తనూజ్ చౌదరి స్వస్థలం నూతనంగా ఏర్పడిన నెల్లూరు జిల్లాలోని కందుకూరు. తండ్రి దివి రామకృష్ణ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రామకృష్ణ టంగుటూరుకు చెందిన ప్రత్యూషను పెళ్లాడి ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో స్థిరపడ్డారు.కాగా వారి కుమారుడు దివి తనూజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్లస్ వన్ చదువుతున్నాడు.
పాఠశాల దశ నుంచే తనూజ్ కి సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే అతను సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవాడు. తనూజ్ అభిరుచిని, సామాజిక దృక్పథాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం అతనిని విద్యార్థి ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఈ క్రమంలో తనూజ్ చౌదరి నిన్న చట్టసభకు కూడా వెళ్లొచ్చాడు. తెలుగు కుర్రాడికి ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత లభించడం ఇటు తెలుగువారికే కాదు దేశానికే గౌరవం. ఇక తనూజ్ సాధించిన ఈ ఘనత పై తెలుగునాట హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.