తమ ప్రకటనల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తుంటాయి ప్రముఖ నగల సంస్థలు. వాటిలో తనిష్క్ కూడా ఒకటి. ఇటీవల తనిష్క్ తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు, ఏకత్వం పేరుతో ఓ ప్రకటన చేసింది. ప్రకటన అందరిని ఆకట్టుకున్నప్పటికీ కొందరు ఆ ప్రకటనపై విరుచుకుపడుతున్నారు.
ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే…
ముస్లిం కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళకు సీమంతం చేసేందుకు అత్తింటి వాళ్లు సిద్ధపడతారు. దీంతో ఆశ్చర్యంలో మునిగిపోయిన కోడలు.. ‘‘ ఇలాంటి వేడుకలు మీ ఇంట్లో చేయరు కదా.. మరి ఇదేంటి?’’అని తన అత్తగారిని అడుగుతుంది. ఇందుకు స్పందించిన ఆమె.. ‘కూతురిని సంతోషపెట్టేందుకు ప్రతి ఇంట్లోనూ ఇలాగే చేస్తారు. అంతే కదా’అంటూ తన ప్రేమను తెలుపుతుంది. అంతా కలిసి ఎంతో సంతోషంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ‘రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’ అంటూ తనిష్క్ ఈ యాడ్‌ను రూపొందించింది.
అయితే ఈ యాడ్ వివాదాస్పదంగా ఉందంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్ లవ్ జిహదీని ప్రోత్సహించే విధంగా ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అంతేకాకుండా గుజరాత్ లోని కచ్ జిల్లాలోని తనిష్క్ స్టోర్కు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించడంతో, యాజమాన్యం సోషల్ మీడియా నుంచి ఆ ప్రకటనను తొలగిస్తున్నట్లు తెలిపింది. కేవలం ఉద్యోగులు, భాగస్వామ్యలు భద్రత కోసమే ఈ ప్రకటనను తొలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్ తో చేసిన ఈ ప్రకటన లవ్ జిహదీని ప్రోత్సహించే విధంగా ఉందంటూ కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. అందుకుగాను #boycotttanishq ట్రెండ్ చేయడంతో సంస్థ ఈ ప్రకటనను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించేందుకు అంగీకరించింది.
అంతేకాకుండా టాటా గ్రూప్ నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపైన ఈ ప్రభావం ఉంటుందంటూ ట్రోల్ అవ్వడంతో సంస్థ దిగి వచ్చి యాడ్ ను తొలగించినట్లు తెలిపింది.
అసలు ఉద్దేశం ఇదే..
ఈ మేరకు తమ యాడ్ కారణంగా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని పేర్కొంటూ సంస్థ అధికార ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్ చేయడమే ఏకత్వం క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కానీ ఇందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేకమైన స్పందనలు వచ్చాయి, ఇందుకు మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. దానితో పాటు మా ఉద్యోగులు, స్టోర్ సిబ్బంది, భాగస్వాములు అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ యాడ్‌ను వెనక్కి తీసుకుంటున్నాం’అని వివరణ ఇచ్చారు.
అందులో తప్పేముంది..
కాగా తనిష్క్ యాడ్ తొలగించగానే మరికొంత మంది నెటిజన్లు.. ‘మతసామరస్యాన్ని పెంపొందించేలా ఉన్న ఈ యాడ్‌లో తప్పేమీ లేదు. అయినా దీనిని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదు’అంటూ వాపోయారు. రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝా వంటి ప్రముఖులు సైతం ఈ యాడ్‌ను సమర్థిస్తూ టాటా గ్రూప్, తనిష్క్ మేనేజ్‌మెంట్‌కు అండగా నిలిచారు. కాగా ఈ యాడ్‌పై ట్రోలింగ్ కారణంగా టాటా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడినట్లు బిజినెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.











