మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసును నవంబర్ 2 కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. అక్టోబర్ 5న పిటీషన్ పై విచారణ జరిపిన టాప్ కోర్టు ఈ కేసును అక్టోబర్ 13కి వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసు విచారణను చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసును 14కి వాయిదా వేసింది. నేడు ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు న్యాయమూర్తి అశోక్ భూషణ్ వేరే కేసులో హాజరుకావాల్సి ఉన్నందున కేసును నవంబర్ 2కి వాయిదా వేశారు.
అసలు కేసు ఏంటీ?
లాక్ డౌన్ విధించడంతో అన్నీ రంగాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. దీంతో ఉద్దీపన చర్యలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదట మూడు నెలలు, ఆ తరువాత మరో మూడు నెలలు రుణాలపై మారటోరియాన్ని విధించింది. ఈ ఆరు నెలల గడువు ఆగష్టు 31తో పూర్తయింది. దీంతో కేంద్రం మరోమారు మారటోరియాన్ని పొడిగిస్తారని ఓరాజాలు ఆశగా ఎదురుచూశారు. అందుకు బ్యాంకులు ఒప్పుకోకపోవడంతో మారటోరియానికి కేంద్రం స్వస్తి పలికింది. కానీ మారటోరియాన్ని వాడుకున్న ప్రజలపై ఆరు నెలల కాలంలో బ్యాంకులు వడ్డీల మీద వడ్డీలు వేశాయి. దీనిపై కొందరు సుప్రీంలో కేసును దాఖలు చేశారు. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తే మారటోరియాన్ని ఎందుకు విధించినట్లు అంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును విచారణకు తీసుకున్న సుప్రీం కేంద్రానికి, ఆర్బిఐకి నోటీసులు జారీ చేశారు.
వాయిదాల పర్వం
తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం అడగటంతో సుప్రీం ఈ కేసును మొదట వాయిదా వేసింది. ఆ తరువాత ఈ నిర్ణయాన్ని తాము ఒక్కరమే తీసుకోలేమని వివిధ సంస్థలు నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పడంతో కేసును అక్టోబర్ 5కి వాయిదా వేశారు. అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి సుప్రీం కోర్టు సెంటర్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కావాల్సిన సమయాన్ని మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పిఎ) ప్రకటించవద్దని సుప్రీం బ్యాంకులకు మరోమారు సూచించింది. అక్టోబర్ 2 న కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల వరకు రుణాలు తిరిగి చెల్లించడంపై సమ్మేళనం వడ్డీని మాఫీ చేస్తామని, ఇది వ్యక్తిగత మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఇ) రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే చర్యగా అభివర్ణించింది. అందుకు ఒప్పుకోని సుప్రీం వడ్డీపై వడ్డీ వసూలు చేయరాదని ఆదేశించింది.