జగన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల కోరుతూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి విజయవాడలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగాల ఖాళీలు తక్షణమే ప్రభుత్వం భర్తీ చేయాలని , అదేసమయంలో ఉద్యోగం వచ్చే వరకు 5 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, యువజన సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.విజయవాడ ధర్నా చౌక్ లో యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు , తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శ రవి నాయుడు , తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలి రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. కాగా జిల్లాల్లో ఎక్కడికక్కడ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తూ పోలీసులు ధర్నా పై ఉక్కుపాదం మోపారు.అయితే అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చివరి వరకు పోరాడి తీరుతామని విద్యార్ధి సంఘాల నాయకులు స్పష్టం చేశారు.ఉద్యోగాల భర్తీ పై హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు మాట తప్పి నిరుద్యోగులను మోసం చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ను కూడా త్వరితగతిన విడుదల చేయాలని యువజనసంఘ నాయకులు కోరుతున్నారు.
Must Read:-వివాదస్పద నిర్ణయాలతో సెన్సిటీవ్గా మారుతున్న విజయవాడ!