దక్షిణాది చిత్రాల్లో లెక్కకు మించిన విలన్ పాత్రలు, రౌడీ పాత్రలు, కామెడీ పాత్రలు పోషించి మెప్పించిన నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. హైద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి మొత్తం ఆయన 300పై చిలుకు చిత్రాల్లో నటించారు.
హైద్రాబాద్ లోని న్యూ సైన్స్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ వరకూ చదివిన నర్సింగ్ యాదవ్ .. విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమా హేమీలు చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ పై రామ్ గోపాల్ వర్మ నర్సింగ్ కు చాలా చిత్రాల్లో అవకాశాలిచ్చి ఆయన్ను ప్రోత్సహించారు. అలాగే చిరంజీవి తను నటించిన చాలా చిత్రాల్లో నర్సింగ్ కు మంచి పాత్రలిచ్చారు. ‘క్షణ క్షణం, మనీ, మనీ మనీ, ఠాగూర్, గాయం, ఇడియట్, సై, మాస్, యమదొంగ లాంటి చిత్రాలు ఆయన కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నర్సింగ్ యాదవ్ మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.