తెరపై ఆయన మాట మంత్రంలా పనిచేస్తుంది. ఒకోసారి అది పువ్వులా మారి సుగంధం వెదజల్లుతుంది. మనసులో దూరి అక్కడే తిష్టవేస్తుంది. మరోసారి ఈటెలా ఎదుటివాడి గుండెల్లో దిగుతుంది. ఒకోసారి కొరడాలా ఝళిపిస్తుంది. అయితే ప్రతీసారి ఆయన మాటలు చమత్కార బాణాలై దూసుకొచ్చి ప్రేక్షకులకు చెక్కిలిగింతలు పెడతాయి. ఏది ఏమైనా ఆయన మాటలు టాలీవుడ్ బాక్సాఫీస్ నే శాసించే తూటాలు. ఆ మాటల మాంత్రికుడిపేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దిమాఖ్ లో ఏమనిపిస్తే .. దాన్ని దిల్ తో రాస్తారు.
మాటల రచయిత అంటే.. నిర్మాతల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టేవాడు కాదని, ప్రేక్షకుల్ని మాయాలోకంలో విహరింపచేసేవాడని చాటిచెప్పిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజం చెప్పాలంటే.. ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టాకే మాటకి విలువ పెరిగింది. సంభాషణలకి గౌరవం హెచ్చింది. మాటకి నగిషీ చెక్కడం.. భాషకి సొగసులద్దడం.. కథలకి కళ తెచ్చిపెట్టడం ఆయన శైలి. మామూలు మాటని చమత్కారంగా చెక్కడంలో ఆయన దిట్ట. ఒక చేత్తో కథ, స్ర్కీన్ ప్లే సంభాషణలు రాసి.. మరో చేత్తో మెగాఫోన్ పట్టి.. టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా దూసుకుపోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు ఈ నవంబర్ 7. ఈ సందర్భంగా ఆయన మాటల తోటలో విహరిస్తూ.. ఆయన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రస్తావించుకుందాం..
త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. భీమవరంలో డిగ్రీ చవివారు. ఆంధ్రాయూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో పీజీ చేశారు. అందులో ఆయన గోల్డ్ మెడలిస్ట్. సినిమాల మీద మక్కువతో హైద్రాబాద్ లో అడుగుపెట్టారు త్రివిక్రమ్ . ఆయన వెంట క్లాస్ మేట్ సునీల్ కూడా వెళ్ళాడు. ఇద్దరూ హైద్రబాద్ లో ఒకే రూమ్ లో ఉండేవారు. బిగినింగ్ లో నటుడు గౌతమ్ రాజ్ పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు త్రివిక్రమ్. ఆయన ద్వారా విజయ్ భాస్కర్ కు పరిచయం అయిన త్రివిక్రమ్.. స్వయంవరం సినిమాతో మొట్టమొదటి సారిగా రచయితగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో .. ఆ తర్వాత నువ్వేకావాలి, నిన్నే ప్రేమిస్తా, సంతోషం, నువు నాకు నచ్చావ్, మన్మథుడు, జై చిరంజీవా లాంటి సినిమాలకు తన తన మాటలతో ప్రాణం పోశారు.
తరుణ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ .. తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కించిన అతడు ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా .. ఇక వెనుదిరిగి చూడలేదు. జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆయన యన్టీఆర్ తో మరో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు తన సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటున్న ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది లియో న్యూస్ .