1000 కోట్లు… 2000 కోట్లు… ఈ మాట వినగానే ఒకప్పుడు గుర్తొచ్చేది హాలీవుడ్ సినిమానే. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరాన్, పీటర్ జాక్సన్, జార్జ్ లూకాస్ లాంటి దర్శకుల చిత్రాలే ఈ కోవలోకి వచ్చేవి. వాటితో పోలిస్తే మన తెలుగు సినిమా పిపీలకమేననాలి. బాహుబలి పుణ్యమా అని ప్రస్తుతం తెలుగు సినిమా ఇప్పుడు భాషా సరిహద్దుల్ని చెరిపివేసింది. తెలుగు సినిమా చరిత్రను రాయాల్సి వస్తే బాహుబలికి ముందు, తర్వాత అని రాయాల్సి వస్తుందేమో. సినిమా జయాపజయాల్సి పక్కన పెడితే అసలు ఇన్ని కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాంతీయ సినిమాని తెరకెక్కించడానికి ఎన్ని గుండెలు కావాలి?
సినిమా అటో ఇటో అయితే పరిస్థితి ఏమిటి? ఏ నమ్మకంతో ‘బాహుబలి’ని తెరకెక్కించారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన మదిలో మెదులుతాయి. 1932లో మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం గడిచిన 85 ఏళ్లలో దిగంతాలకు సాగిపోయింది. ప్రభాస్ హీరోగా ‘బాహుబలి’ సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి 2011లో ప్రకటించారు. 2013లో షూటింగు ప్రారంభించి 2015లో సినిమా విడుదల చేశారు. ఇంత సుదీర్ఘకాలం షూటింగు జరిగిన తెలుగు సినిమా ఇదేననాలి. రూ.180 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసింది. రూ. 100 కోట్ల క్లబ్ చేరిన తెలుగు సినిమా లేని తరుణంలో ఈ రికార్డును సాధించడం మామూలు విషయం కాదు.
సినిమా అంటేనే నేల విడిచి సాము చేయడం. అలాంటిది ఇంత బడ్జెట్ తో ఇంత సుదీర్ఘకాలం షూటింగు చేయడం, అందరిమెప్పూ పొందడం రాజమౌళికే చెల్లింది. ముఖ్యంగా రాజమౌళి నమ్మకానికి హ్యాట్సాఫ్ చెప్పాల్పిందే. ‘బాహుబలి’కి కొనసాగింపుగా ‘బాహుబలి కంక్లూజన్’ ను తెరకెక్కించడం మరో విశేషం. రూ.250 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.2000 కోట్ల వసూళ్లు సాధించింది. కలెక్షన్లలో అమీర్ ఖాన్ రూపొందించిన ‘దంగల్’తో పోటీ పడింది. ఒక ప్రాంతీయ చిత్రం లెక్కలు ఈ తరహాలో ఉన్నాయంటే అది ఒన్ అండ్ ఓన్లీ రాజమౌళి వల్లే సాధ్యమైంది. తెలుగు సినిమా తలరాత మారిందనడానికి ఒక్క ‘బాహుబలి’ చాలు. బాహుబలికి ముందు తర్వాత అనే పదం కూడా పుట్టింది. అంతేకాదు సినిమా కలెక్షన్లు చెప్పాల్సి వస్తే నాన్ బాహుబలి రికార్డులుగానే చెబుతుంటారు.
స్టార్ డమ్మా ? డైరెక్టర్ దమ్మా?
సినిమా అనేది దర్శకుడి మీడియా అని దాసరి నారాయణరావు అంటుంటారు. ‘బాహుబలి’, ‘ఘాజీ’ లాంటి సినిమాలు చూశాక అది నిజమేనని అనిపిస్తుంది. దర్శకుడు లేకపోతే స్టార్ ఎక్కడుంటాడని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఎందరో దర్శక మహానుభావులు తయారు చేసిన స్టార్లే నేడు సినిమా రంగాన్ని ఏలుతున్నారు. అంతేగాని స్టార్లు తయారు చేసిన దర్శకులు లేరు. వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంది. స్టార్ డమ్ వచ్చాక ఆ హీరో కాల్షీట్ల కోసం పడిగాపులు పడే దర్శకులే ఎక్కువ. ఇంకో విషయం ఏమిటంటే షూటింగ్ స్పాట్ లోకి స్టార్ రాగేనే వంగి వంగి సలాములు చేసే దర్శకులే ఎక్కువ. హీరో ప్రాపకం కోసం వ్యక్తిత్వాన్ని కోల్పోతున్న దర్శకులు ఎందరో. ఎవరు ఎవరిని గౌరవించాలనే విషయాన్ని పక్కన పెట్టి సినిమా బాగా రావడానికి స్నేహపూర్వకంగా ఇరువురూ మెలగాల్సిన అవసరం ఉంది.
‘బాహుబలి’ లాంటి చిత్రం వచ్చాక రాజమౌళి దర్శకత్వంలో పడే పనిచేయాలని ఉబలాటపడే స్టార్లు చాలా మందే ఉన్నారు. దర్శకుడిలో దమ్ముకు స్టార్ డమ్ బ్రహ్మరథం పడుతుందని వేరే చెప్పనక్కర లేదు. రాజమౌళి, క్రిష్, సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గతంలోనూ ఇది జరిగింది. కాకపోతే అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్లింది. గతంలో ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’, ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’ లాంటి గొప్ప చిత్రాలు ఎన్నో వచ్చాయి. నేడు కె. విశ్వనాథ్ లాంటి దర్శకుడికి దాదాసాహెబ్ లాంటి స్వర్ణకమలం దక్కిందంటే ఇది తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణం. మున్ముందు ఆస్కార్ లాంటి అంతర్జాతీయ గౌరవం తెలుగు సినిమాకు దక్కినా ఆశ్చర్యపోనవసరంలేదు.
ఆ స్టామినా మన దర్శకులకు ఉందని నిరూపించింది మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా ‘ఆర్.ఆర్.ఆర్.’ రూపొందించే పనిలొ ఉన్నారు. రాజమౌళి దూకుడుకు మొట్టమొదటిసారిగా బ్రేకు వేసింది కరోనా వైరస్సే. లేకుంటే ఈపాటికే ఆయన మరో సినిమా ప్రకటన వచ్చి ఉండేది. రాజమౌళి మేకింగ్ స్టయిల్ అంతర్జాతీయ దర్శకులు కూడా ముచ్చటపడుతున్నారు. కథ గొప్పగా లేకపోయినా కథనంలో ఎంత గొప్పగా మలచవచ్చో రాజమౌళి సినిమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు మన దర్శక దిగ్గజం రాజమౌళి పుట్టిన రోజు. ‘దిలియోన్యూస్’ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తోంది. ఇప్పటిదాకా ఆయన హీరోలెవ్వరూ సామాజిక మాధ్యమాల్లో ఆయన పుట్టినరోజు గురించి స్పందించలేదు. నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ముందుగానే స్పందించింది.
– హేమసుందర్ పామర్తి
Wishing you a very Happy Birthday Jakkana @ssrajamouli !! Love you pic.twitter.com/gcCdSveiGZ
— Jr NTR (@tarak9999) October 10, 2020
Happy birthday to the man with a vision as high as the mighty Everest! @ssrajamouli garu, it’s a privilege to be working with you sir. These moments will be etched in our memories forever 🙏🏻 #HBDSSRajamouli pic.twitter.com/OXjVqJi8yW
— DVV Entertainment (@DVVMovies) October 9, 2020











