డబ్బింగ్ రూపంలో టాలీవుడ్ లో విడుదలైన పరభాషా చిత్రాలు ఎన్నో గతంలో ఇక్కడి స్ట్రైట్ మూవీస్ ను మించి విజయవంతమైన సందర్భాలున్నాయి. అయితే ఆ చిత్రాల్లోని బలమైన కథ, అద్భుతమైన పాత్ర పోషణ ఎవరో ఒక హీరోని, ఆకట్టుకోవడం తిరిగి వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వారు రీమేక్ చేయడం జరిగింది. ఆ రూపంలో కూడా ఆ సినిమాలు మరోసారి సూపర్ సక్సెస్ అవడం ఆశ్చపరుస్తుంది. ‘రౌడీగారి పెళ్ళాం, అదిరింది అల్లుడు, అబ్బాయి గారు, అబ్బాయిగారి పెళ్ళి, చిలకపచ్చకాపురం, లాంటి సూపర్ హిట్టు సినిమాలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్.
అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ లో కూడా ఒకసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చి.. మరోసారి రీమేక్ అవుతోన్న మరికొన్ని సినిమాలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న చెప్పుకోదగ్గ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ మూవీ. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ మూవీ .. అప్పట్లోనే తెలుగులో కూడా డబ్బింగ్ రూపంలో ఇక్కడ విడుదలైంది. అయితే ఆ సమయంలో ఇక్కడ విడుదలైన కొన్ని స్టార్ హీరోల సినిమాల మధ్యలో ఆ సినిమా రావడం పోవడం కూడా ఎవరికీ తెలియలేదు. అందుకేనేమో .. మెగాస్టార్ ఇప్పుడు ఆ సినిమా కథతో సరికొత్త గా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు కు లోనయిన ఈ సినిమా కథ.. మెగాభిమానుల్ని మెప్పించే ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది.
ఇక లిస్ట్ లో ఉన్న అలాంటిదే మరో సినిమా మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ‘సేతుపతి’ అనే తమిళ సూపర్ హిట్ మూవీకి ఫ్రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ‘సేతుపతి’ సినిమా గతంలో ఘంటా శ్రీనివాసరావు తనయుడు ఘంటా రవితేజ లాంచింగ్ మూవీగా జయదేవ్ పేరుతో అఫీషియల్ గా రీమేక్ అయింది. జయంతి సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తెలుగులో సరిగ్గా ఆడలేదు. అందుకేనేమో రవితేజ అదే స్టోరీతో ఇప్పుడు ‘క్రాక్’ గా రాబోతున్నాడు. తెలుగు నేటివిటీ తగ్గట్టుగా.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే విధంగా మార్పులు చేర్పులతో సినిమా విడుదలకు సిద్ధమయింది.
ఇక లాస్ట్ బట్ .. నాట్ లీస్ట్ .. రవితేజ నటిస్తోన్న మరో సినిమా ‘ఖిలాడీ’ కూడా ఓ తమిళ సినిమా .. అందులోనూ తెలుగులో ఒక సారి డబ్బింగ్ గా అలరించిన సినిమా అయిన ‘తెరి’ కి ఫ్రీమేక్ అని తెలుస్తోంది. దళపతి విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘తెరి’ సినిమాను తెలుగులో ‘పోలీస్’ పేరుతో దిల్ రాజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఆశించిన రీతిలో అలరించనప్పటికీ.. తమిళంలో మాత్రం సూపర్ హిట్టయింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన తెరి సినిమా లో విజయ్ రెండు డిఫరెంట్ పాత్రల్ని పోషించాడు. రీసెంట్ గా విడుదలైన ఖిలాడీ పోస్టర్ లో రవితేజ రెండు పాత్రల్ని దర్శకుడు రమేశ్ వర్మ రివీల్ చేశాడు. అయితే ఇంతకు ముందు తెరి పోస్టర్ లో విజయ్ రివీలైన తీరులోనే రవితేజ రెండు పాత్రల్నీ రివీల్ చేయడంతో .. ఈ సినిమా తెరి కథతో వస్తోందని క్లియర్ అయింది. మరి ఈ మూడు సినిమాల కథలు.. మరోసారి ఇక్కడ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాయో చూడాలి.