టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈనెల 7వ న పీసీసీ చీఫ్ పగ్గాలు చేపడతారు. బాధ్యతల స్వీకరణకు ముందే రేవంత్ రెడ్డి జట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. పార్టీ సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, కార్యకర్తలతో వరుస భేటీ అవుతూ.. ప్రతిఒక్కరిని కలుపుకొని పోతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలోధ్వజమెత్తారు. త్వరలోనే ప్రగతి భవన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తేల్చి చెప్పారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే.. పాదయాత్రలతోనే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్క ఛాన్స్ ప్లీజ్..
ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ.. టీకాంగ్రెస్ నేతలు దీన్ని క్యాష్ చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై రేవంత్ రెడ్డి బలంగా వినిపించేందుకే పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ ఏం చేసింది? అధినేత్రి సోనియాగాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్ర వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనని రేవంత్ చెప్పే అవకాశం ఉంది.
33 జిల్లాలను మొత్తం చుట్టేలా..
సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాలను మొత్తం చుట్టేలా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు మొదటగా జోగులాంబ గద్వాల జిల్లాను ఎంచుకున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తన పాదయాత్రను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ నుంచి మొదలుపెట్టి.. అదిలాబాద్ జిల్లాలో ముగించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. తన పాదయాత్రపై వస్తున్న వార్తలపై తాజాగా రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. మొన్నటి వరకు ఒక యాక్షన్ కమిటీ మెంబర్ అని, తాను ఇప్పుడు ఒక అధ్యక్షుడినని, వర్కింగ్ ప్రెసిడెంట్స్, కీలక నేతలతో మాట్లాడి తన నిర్ణయం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు, అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని, వాళ్లందరితో చర్చించిన తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకుంటానని కొత్త సారథి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.