టీపీసీసీపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆశావహులు ఢిల్లీకి పయనం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఢిల్లీకి పయనం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల వద్ద ముందు అపాయింట్లు ఖరారైనట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం రాహుల్ గాంధీతో పాటు మరికొందరు కీలక నేతలతో సమావేశం కానున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వెంటనే ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇన్ ఛార్జి నుంచి ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి పీసీసీ కన్‌ఫర్మ్ అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రేవంత్‌కి పీసీసీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన వ్యక్తికి కూడా సీడబ్ల్యూసీలో చోటు కల్పించనున్నారని తెలుస్తోంది.
పోటీలో చాలా మంది..
టీపీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లతో పాటు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, సీతక్క తదితరుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్యే పోటీ ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
ఢీ అంటే ఢీ అనే వారికే ప్రాధాన్యం..
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఏక కాలంలో టీఆర్ఎస్‌ను, బీజేపీని ఢీకొట్టే సామర్థ్యం ఉండడంతో పాటు జనాల్లో క్రేజ్ ఉన్న నాయకుడిని, విశ్వసనీయత, ఆర్థిక వెసులుబాటు ఉన్న నాయకుడిని ఎంపిక చేయాలని పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌తో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఇప్పటికే ఢీ అంటే ఢీ అనే విధంగా పోరాడుతున్న రేవంత్‌కి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దాదాపు 17జిల్లాల అధ్యక్షులు రేవంత్‌కి సానుకూలంగా ఉండగా 5గురు తటస్థంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మిగతావారు రేవంత్‌కి కాకుండా మిగతావారి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా ముఖ్యనాయకుల అభిప్రాయం విషయానికి వస్తే..150 మందితో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఇప్పటికే చర్చించారు. అందులో పలు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీటన్నిపై వర్క్ చేయడంతో పాటు పార్టీ కేడర్ అభిప్రాయాలను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని ఇప్పటికే మాణికం ఠాగూర్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం నాయకుల ఢిల్లీ టూర్‌కి ప్రాధాన్యం ఏర్పడింది.
చివరి క్షణంలో లాభీయింగ్‌లు..
రేవంత్‌రెడ్డికి టీపీసీసీ ఇవ్వవద్దంటూ పక్క రాష్ట్రానికి చెందిన ఎంపీ మరో నలుగురు ఎంపీలతో కలసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో రేవంత్‌రెడ్డికి ముఖ్య అనుచరులుగా చెబుతున్నవారు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసినట్టు సమాచారం. కర్ణాటకలో బాహుబలిగా అభిమానులు పిలిచే కాంగ్రెస్ నేతతో ఇప్పటికే రేవంత్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఆర్థికంగా ఈ ఇద్దరు నాయకులు ఇచ్చిపుచ్చుకునేంత సంబంధాలు ఉండడం కూడా రేవంత్‌కి సానుకూల అంశంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెరపైకి ఓటు బ్యాంకు..
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఠాగూర్ నుంచి వెళ్లిన మరో నివేదిక కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నారని, పార్టీ మారిన వారికి టీసీసీసీ ఎలా ఇస్తారని, పార్టీ విధేయులకే ఇవ్వాలని కొందరు నాయకులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి వచ్చినవారికి పదవి ఇవ్వాలా..వద్దా అనే కంటే.. సదరు నాయకుడికి పదవి ఇస్తే.. ఓటు బ్యాంకును ఆకర్షించగలుగుతారా లేదా అనేదే ముఖ్యంగా కనిపిస్తోంది. ఈ మేరకే నివేదిక వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద అనూహ్య పరిణామాలు, లాభీయింగ్‌లు చోటు చేసుకోకుంటే..కొన్ని గంటల్లోనే టీసీసీసీపై పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది