న్యూజెర్సీ ఎడిసన్‌లో సాయి దత్త పీఠం నిర్మించన శ్రీ శివ విష్ణు ఆలయం ప్రారంభోత్సవానికి సన్నాహకంగా సంప్రదాయ సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ వేదికగా జరిగిన సంప్రదాయ సంగీత విభావరికి అద్భుతమైన స్పందన లభించింది. వేల మంది ఆన్ లైన్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆరెంజ్ మీడియా కాన్సెప్ట్ సహకారంతో ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ సంగీత కళాకారులంతా తమ ప్రతిభను ప్రదర్శించారు. వీక్షకులు భక్తి సంగీతంలోమునిగితేలారు. అనేక భాషల్లో అనేక భక్తి గీతాలతో వీక్షకులను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లారు.
వీక్షకులను ఆకట్టుకున్న కళాకారులు
ప్రఖ్యాత వీణా విద్వాంసుడు శ్రీ ఫణి నారాయణ తన వాద్య సహకార బృందంతో 2 గంటల పాటు, ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసారంతో సంగీతఝరిలో ఓలలాడించారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, గురు స్వాతి అట్లూరి ప్రదర్శించిన భక్తి రసమయ నృత్య కార్యక్రమం, దివ్య ఏలూరి తన శిష్య బృందంతో చేసిన నృత్య మెడ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒడిస్సీ నృత్య కళాకారిణి బిడిష మహంతి మోక్ష నృత్య ప్రదర్శన, జయీత దత్త ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నాయి. ఇంకా ఎంతో మంది కళాకారుల సంగీత కార్యక్రమాలు, ప్రముఖ సంగీత గురు రామాచారి బృంద గాన కచేరీ, వీణ, ఫ్లూట్, సితార్‌లతో కళాకారులు అందరినీ అలరింపచేశారు.

హైదరాబాద్ నుండి ప్రముఖ గాయకులు హరి గుంట, ప్రవీణ్ కొప్పోలు పద్యాలు,,వైజాగ్ శ్రీ మాత స్టూడియోస్ నుండి వెంపలి అఖిల, శ్రీలత మూల తదితరుల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరితో పాటు మీగడ రామలింగస్వామి చేసిన 139 వ సంగీతనవావధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ కవి, సంగీత విద్వాంసుడు కిభశ్రీ అధ్వర్యంలో మిత్ర ప్రాశ్నిక బృందంతో ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో అద్భుతంగా నిర్వహించినందుకు ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ అధినేత అశోక్ బడ్డి, వారి సాంకేతిక బృందానికి సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాయి దత్త పీఠం నుండి లైవ్‌లో పాల్గొని తమ పాటలతో అలరించిన ప్రసాద్ సింహాద్రి, అదితి భావరాజులను రఘుశర్మ, ఉపేంద్రలు సత్కరించారు.
మే 2 నుంచి 8 వరకు శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు
మే 2 నుంచి 8 వరకు శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి, వాటిని కూడా దిగ్విజయం చేయాలని రఘు శర్మ శంకరమంచి భక్తులను కోరారు. శ్రీ శివ, విష్ణు ఆలయంలో ప్రత్యేక విశిష్టతలన్నింటిని ఆన్ లైన్లో వివరించారు. న్యూజెర్సీలో హిందూ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీ శివ, విష్ణు ఆలయాన్ని సకల దేవతల సమాహారంగా తీర్చిదిద్దినట్టు రఘు శంకరమంచి తెలిపారు. న్యూజెర్సీలోని భక్తులంతా శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రారంభోత్సవానికి తరలిరావాలని, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కోరారు. ఆన్ లైన్ సంగీత విభావరిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సాయి దత్త పీఠం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అశోక్ బడ్డి, మురళీకృష్ణ మేడిచెర్లలతో పాటు దత్త పీఠం డైరెక్టర్‌లను, స్టాఫ్, వాలంటీర్స్ ను ఎస్.డి.పి కుటుంబ సభ్యులందరిని, ఓం కాన్సెప్ట్స్ టీమ్ సభ్యులను రఘు శర్మ శంకరమంచి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మే 2 నుంచి 8న జరిగే ఆలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీవీ ఛానెల్స్‌కు, రేడియో ఛానెల్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Must Read ;- అలిపిరి వద్దే గదుల వివరాలు.. భక్తులకు టీటీడీ శుభవార్త











