కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలు, ఇతర మూకుమ్మడి కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అందులో భాగంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కరోనా కట్టడి చర్యలు సరిగా లేవంటూ..
కరోనాను అరికట్టే చర్యలు సరిగ్గాలేవంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతోపాటు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ నమోదైనట్లు చూపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ఆ కథనం సారాంశం. కాగా గతంలోనూ కొవిడ్ నియంత్రణకు తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో పరీక్షల సంఖ్యను పెంచాలని పలుమార్లు హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అప్పట్లో కొన్ని రోజులు ఆ ఆదేశాలను పాటించిన తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందనే విమర్శలు వినిపించాయి. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 48గంటల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని, కర్ఫ్యూ విధిస్తారా లాక్ డౌన్ విధిస్తారా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక ఇబ్బందులు, రోజూవారి ఇబ్బందుల కారణంగా కఠినమైన ఆంక్షలు ఉండకపోవచ్చని, అయితే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వ్యాఖ్యానించారు.
గతంలో ఆదేశాలు, సూచనలు
ఇక గతంలో కొవిడ్ కట్టడికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన నివేదికపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికలో కనీస వివరాలూ ఉండడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సారికూడా అలాంటి వ్యాఖ్యలే చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లేకున్నా..కనీసం కంటైన్మెంట్ జోన్లైనా ఉండాలని గత వారం హైకోర్టు సూచించిన విషయమూ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ ఆదేశాల అమలుకు ఎంతవరకు ముందుకొస్తుందనే చర్చకూడా మొదలైంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఆర్టీసీసీఆర్ టెస్టులు చేశాకే అనుమతించాలని ఆదేశించినా చాలా చోట్ల అమలు కాని పరిస్థితిని కూడా కొందరు తెరపైకి తెస్తున్నారు. ఇక తెలంగాణలో గత 24గంటల్లో కొత్తగా 4,009 కేసులు నమోదుకాగా 14 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
దాపరికమన్న ఆంధ్రజ్యోతి..
ఇక తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో పాటు ఆంధ్రజ్యోతి వరుసగా రెండు కథనాలను ప్రచురించింది. క్షేత్ర్రస్థాయిలో పరిస్థితికి, ప్రభుత్వం ఇచ్చే నెంబర్లకు సంబంధం లేదని కథనం ప్రచురించింది. దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు శనివారం 12,177 రెమ్డెసివేర్ ఇంజెక్షన్లను పంపగా సాయంత్రానికి 765 మిగిలాయని, ఇప్పటి వరకు తెలంగాణకు పంపిన ఇంజెక్షన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ ఇంజెక్షన్లు వెళ్తున్నాయని కథనంలో పేర్కొంది. టీకాల విషయంలోనూ అదే జరుగుతోందని, ఇప్పటి వరకు తెలంగాణకు 34లక్షల టీకాలు మాత్రమే రాగా చత్తీస్‌ఘడ్‌కి 50లక్షల టీకాలు వెళ్లాయని, ఇందుకు కేసుల సంఖ్య కూడా తక్కువగా చూపించడం ఒక కారణమైతే, రాజకీయ కారణాలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మొత్తం మీద తెలంగాణ సర్కారు కొవిడ్ కేసుల సంఖ్యను దాస్తోందా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక హైకోర్టు ఆదేశాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Must Read ;- తెలంగాణలో 3,052 కరోనా కేసులు