ఇన్సూరెన్సు సొమ్ము కోసం సొంత గోదాంకే కన్నం వేసి, తమకేమీ తెలియనట్లు, దొంగతనం జరిగిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసి అడ్డంగా బుక్కయ్యారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవం బయటపడటంతో స్టేషన్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఎవరా ఘనులు, ఏంటా కథ తెలుసుకోవాలని ఉందా .. ఆలస్యం ఎందుకు..
సినీఫక్కీలో..
న్యూఢిల్లీకి చెందిన కిషన్ ధన్ అగ్రి ఫైనాన్సియల్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ మేనేజర్ గుండా మనోజ్ కుమార్ తమ కంపెనీకి చెందిన విజయనగరం జిల్లా మోదవలసలో ఉన్న వేర్ హౌస్ లో 24 లక్షలు విలువ చేసే 350 ముడి జీడి పిక్కల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా డెంకాడ పోలీసులకు సినీఫక్కీలో ఫిర్యాదు చేసారు.
ఈ ఫిర్యాదుపై డెంకాడ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రమైన నేరం అయినందున జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదేశాల మేరకు భోగాపురం సి.ఐ శ్రీధర్ కేసు దర్యాప్తును చేపట్టారు. ప్రాధమిక విచారణలో ఈ నెల 22న దొంగిలించిన జీడి పిక్కల బస్తాలను ఎపి 39 టిడి 0027లో లోడు చేసినట్లుగా గుర్తించారు.
జీడి పిక్కల బస్తాలను లోడు చేసిన కూలీలను విచారించగా వి.ఒన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నారా విశ్వనాథం, డిజిఎమ్ వాసుదేవ్ గిరీష్, ఎజిఎమ్ సిహెచ్.వెంకటరావు, ఈ కేసులో ఫిర్యాదు చేసిన గుండా మనోజ్ కుమార్ (ఇతను కిషన్ ధన్ అగ్రి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు)లు ఈ నేరం చేసినట్లుగా వెల్లడైంది.

విచారణలో ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ నుండి రూ. 60 లక్షలను అక్రమంగా పొందేందుకు వి-ఒన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నారా విశ్వనాథం, గుండా మనోజ్ కుమార్ ఈ కుట్రను పన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. భోగాపురం సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం నిందితులైన ఎ-1 దమ్మ వాసుదేవ్ గిరీష్, ఎ-2 గుండా మనోజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. 350 జీడి పిక్కల బస్తాలను, రవాణా చేసేందుకు వినియోగించిన ఎపి 39 టిడి 0027 నెంబరుగల 16 టైర్లు లారీ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.
పరారీలో ఉన్న నిందితులు కోసం గాలింపు
ఈ కేసులో నిందితులైన ఎ-3 సిహెచ్. వెంకటరావు, ఎ-4 నారా విశ్వనాధం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.
పోలీసులకు అభినందన
తప్పుడు రిపోర్టు ద్వారా ఇన్స్యూరెన్స్ పొందేందుకు చేసిన కుట్రను భగ్నంచేసి, నిందితులను అరెస్టుచేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగాను, సమయస్ఫూర్తితో వ్యవహరించిన భోగాపురం సిఐ శ్రీధర్, డెంకాడ ఎస్ఐ సాగర్ బాబు, ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ప్రత్యేకంగా అభినందించారు.











