దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యాక.. పోస్ట్ పోల్ సర్వేలు వెలుగుచూస్తున్నాయి. అందరూ దాదాపుగా తెరాస విజయమే ఖాయం అని చెబుతున్నారు. అందులో ముందునుంచి కూడా చాలా మందికి సందేహం లేదు. కొత్తగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే … తన మెజారిటీ కంటె ఎక్కువ మెజారిటీ సాధించుకు వస్తానని చెప్పిన హరీష్ రావు మాటలు నిజమౌతాయా? లేదా? అనేదే పరిగణించాల్సిన విషయం.
నిజానికి అభ్యర్థి హఠాన్మరణం వలన జరిగే ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పోటీచేస్తే.. విజయం వారికే ఖచ్చితంగా దక్కడం సర్వసాధారణం. అందుకే చాలా సందర్భాల్లో ఇలాంటి ఎన్నికలు ఏకగ్రీవం అవుతుంటాయి. కానీ సుమారు రెండేళ్ల పాలనలో కేసీఆర్ సర్కారు ప్రజాదరణ కోల్పోయిందనే నమ్మకంతో.. 2018 ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీకి సాహసించాయి. అసలే సోలిపేట రామలింగారెడ్డికి కూడా ఉన్న మంచి పేరు కలిపి, తెరాస వ్యూహాత్మకంగా మోహరించిన ఆయన భార్య ఘన విజయం సాధిస్తుందని అంతా అంచనా వేశారు.
అయితే మరీ అంత గొప్ప విజయం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. సర్వేలలో సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ ఆరా.. పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో బీజేపీ కంటె తెరాస కేవలం నాలుగు శాతం ఓట్ల ఆధిక్యం మాత్రమే సంపాదించే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి ఈ ఎన్నికల్లో చాలా చాలా విషయాలు జరిగాయి. రఘునందన్ రావు బంధువుల ఇళ్లపై సోదాల దగ్గరినుంచి, బండిసంజయ్ పట్ల పోలీసులు అమానుష ప్రవర్తన అరెస్టు, బీజేపీ వారి మీద మాత్రం వరుస పోలీసు దాడులు, ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ తమిళనాడు అధికారిని నియమించడం, పోలింగ్ కు ముందురోజున.. డబ్బులు పంచడానికి సిద్ధిపేట హోటళ్లలో తెరాస ఎమ్మెల్యేలు తిష్టవేశారనే ప్రచారం జరగడం, దొమ్మీలు, కొట్లాటలు ఇవన్నీ గతంలో ఎన్నడూలేనంత ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇంత జరిగినా కూడా తెరాస కేవలం 4 శాతం ఓట్ల అధిక్యతతోనే బయటపడబోతున్నదా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
ఆరా వెల్లడించిన వివరాల ప్రకారం.. తెరాసకు 48.72 శాతం ఓట్లు, బీజేపీకి 44.64 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 6.12 శాతం ఓట్లు, ఇతరులకు 2.52 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. తెరాస, బీజేపీలకు మాత్రం తమ అంచనాలలో 3 శాతం అటుఇటుగా ఉండవచ్చునని ఆరా సంస్థ అధినేత మస్తాన్ చెబుతున్నారు. ఇవే అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉంటే గనుక.. తెరాస విఫలమైనట్లే భావించాలి. విజయం దక్కినంత మాత్రాన అది వారి ప్రజాదరణ అనుకోడానికి వీల్లేదు. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని బీజేపీ.. ఈ ఎన్నికల్లో 45 శాతం ఓట్ల దాకా పెరిగితే గనుక.. వారు అద్భుతం సృష్టించినట్టే లెక్క. ఆ పరిస్థితి అధికార తెరాసకు ప్రమాద హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది.