ఏపీలో మొట్ట మొదట కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదు అయినా జిల్లా నెల్లూరు జిల్లాలోనే. ఇప్పుడు అదే జిల్లాలో తమ ప్రాణాలు పణంగా పెట్టి ఇన్నాళ్లూ పనిచేసిన కాంట్రాక్టు వైద్య సిబ్బంది.., శనివారం రోడ్డున పడిన ఘటన ఆవేదన కలిగించింది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో covid పాజిటివ్ వ్యక్తులకు వైద్య సేవలందించేందుకు ఓ దశలో వైద్యులు, నర్సులు కరువయ్యారు. ఈ సమయంలోనే ప్రభుత్వం నెల్లూరు జీజీహెచ్‌ను ప్రాంతీయ కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించంది. కాంట్రాక్ట్ విధానంలో 6 నెలల కాలానికి ఆగస్టులో డాక్టర్స్, ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు, నర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లను వైద్య ఆరోగ్య శాఖ విధుల్లోకి తీసుకుంది.
ఇన్నాళ్లూ వీరితో గొడ్డు చాకిరీ చేయించుకున్నారు. కానీ, కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.., గడువు ముగియక ముందే శనివారం విధుల నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఒక్క నెల జీతం కూడా ఇవ్వకుండానే వందలాది మందిని విధుల నుంచి తొలగించడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 10 కోట్ల వరకు జీతం బకాయిలు ఉన్నాయని.., తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించి.., ఎందరో రోగుల ప్రాణాలు కాపాడితే.., జీతం ఇవ్వకుండా? ఇంకా 3 నెలలు కాంట్రాక్టు ఉన్నా? రోడ్డున పడేస్తారా అంటూ ఆస్పత్రి ముందు ఉద్యోగులు ధర్నాకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా నెల్లూరు పర్యటనలో ఉన్న సి.పి.ఎం. నేత మధు కూడా సంఘటనా స్థలానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కలెక్టర్ జోక్యంతో సమసిన వివాదం…!
ఈ వివాదంపై కలెక్టర్ చక్రధర్ స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి.., 10 కోట్ల జీతం బకాయిలు వారంలో అందేలా చర్యలుతీసుకున్నారు. 1014 మందిలో ఏ ఒక్కరినీ తొలగించారదని GGH అధికారులను ఆదేశించారు. దీనితో సమస్య సద్దుమణిగింది.
ప్రభుత్వమే రోడ్డున పడేస్తే, ప్రైవేట్ సంస్థలు నెత్తిన పెట్టుకుంటాయా?
వేలకోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం…, కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన వైద్య సిబ్బంది పట్ల ఇలా వ్యవహరించడం ప్రజల్ని షాక్ కి గురిచేసింది. ప్రభుత్వమే జీతం ఇవ్వకుండా? ఇంకా కాంట్రాక్టు ఉన్నా తొలగిస్తే..? ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులను రోడ్డున పడేయవా? అని సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ 2nd వేవ్ నిజంగా వస్తే..? అప్పుడు ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఎవరూ ముందుకు వస్తారని వైద్యరంగ నిపుణుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.