ట్రంప్ నవంబరులో ఎదుర్కొనబోయే ఎన్నికలకు అన్ని రకాలుగానూ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారా? కరోనా అంశాన్ని కూడా.. ఆ సమయానికి అదుపు చేస్తే చాలు.. హాట్ హాట్ ఆ ఎడ్వాంటేజీ తనకు ఎన్నికలలో మైలేజీ ఇస్తుందని ఆయన కలగంటున్నారా? అలాంటి ఆలోచనలు ఆయనకు ఉన్నాయో లేదో గానీ.. అమెరికాలో వ్యాక్సిన్ నవంబరు నాటికి సిద్ధం అవుతుందని ఆయన చెబుతున్న మాటలు మాత్రం అలాంటి అభిప్రాయమే కలిగిస్తున్నాయి.
కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి అధ్యక్షుడు ట్రంప్ సరైన చర్యలు తీసుకోలేదని తొలినుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించాలని నిపుణులు సూచించినా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేయలేకపోయారు. దీంతో అగ్రరాజ్యంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నవంబర్ 3 నాటికి వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ప్రకటన చేస్తున్నాడని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది. కానీ వాస్తవ పరిస్థితులు అంతకంటె ఘోరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి రానుంది.
అదే జరిగితే, ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన వేగవంతమైన వ్యాక్సిన్ కానుంది. సాధారణంగా వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు చాలా సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దానికి పైగా సమయం పడుతోంది. కానీ కరోనాకు వ్యాక్సిన్ అత్యంత అవసరం కావడంతో కంపనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నంలో చాలా కంపనీలు పురోగమనంలో ఉన్నాయి. కానీ వాటి సమర్థతపై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ ల తయారీకి చేయూతనిస్తున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లాంటి వారు కూడా మొదటగా వచ్చే వ్యాక్సిన్ ఉత్తమమైనవి, అత్యంత ప్రభావవంతమైనవి, అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పలేకపోతున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే మరింత సమయం పట్టవచ్చు. దీనిని బట్టి కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు మరింత సమయం పట్టనుందని నిపుణులు బావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైరాలజిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, వ్యాక్సినాలజిస్టులు, అంటు వ్యాధుల నిపుణులు, వైద్య నిపుణులు దాదాపు 400 మంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డి.ఏ) కు లేఖ వ్రాశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై రెగ్యులేటరీ సమీక్ష మిగిలిన వ్యాక్సిన్ల మాదిరిగా కఠినంగా ఉండకపోవచ్చని ఆ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయా సమీకరణాలను పరిగణనలోకి తీసుకోకుండా కరోనా వైరస్ వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చేందుకు కఠినమైన పరీక్షలు చేయాలనీ వారు కోరారు. కరోనాకు వ్యాక్సిన్ అవసరమే కానీ ఆ వ్యాక్సిన్లను కఠినంగా అధ్యయనం చేయాలని వారు కోరారు. క్లినికల్ ట్రయల్స్ మూడు దశలు పూర్తి చేసిన వ్యాక్సిన్ల భద్రత మరియు సమర్థతను అంచనా వేసిన తర్వాత మాత్రమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. మునుపటి వ్యాక్సిన్ ల మాదిరిగానే ఎఫ్‌డిఎ సమీక్ష కూడా సమగ్రంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.యుఎస్ మాజీ సర్జన్ జనరల్ తో సహా ఎఫ్డిఎ మాజీ అధిపతి కూడా ఎఫ్డిఎ పర్యవేక్షణలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లపై మరింత సమాచారం కోరుతూ సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
ఈ వ్యాక్సిన్ల గురించి మనకు తెలిసినవి మరియు మనకు తెలియని వాటిని ప్రజలకు వివరించగలగాలని వారు స్పష్టం చేశారు. అది జరగాలంటే, రాజకీయ పరిగణనలోకి తీసుకోకుండా పారదర్శకమైన ఎఫ్‌డిఎ ఆమోద ప్రక్రియను మనం చూడగలగాలని ప్రభుత్వ అధికారులు ఈ ముఖ్య విషయాలను గమనించాలని నిపుణులు ఆ లేఖలో పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ సమర్థత అంశాలను పరిశీలనలోకి మాత్రమే తీసుకొని అనుమతి ఇస్తామని రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. తాను ఆశావాదినని తెలిపిన ఆయన వచ్చే ఏడాది వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని తెలిపారు. సమర్ధవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ట్రయిల్ -1 అధ్యయనంలో ఐసోబాడీస్ అభివృద్ధి చెందుతున్నాయని గుర్తించామని తెలిపారు. ఇంకా ఈ వ్యాక్సిన్ ట్రయిల్-2, ట్రయిల్-3 దశలను దాటాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చెప్పిన మేరకు నవంబర్ 3 నాటికీ వ్యాక్సిన్ రావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ ఒత్తిడి మేరకు ఎన్నికల కంటే ముందుగా వ్యాక్సిన్ వచ్చినా దాని సమర్థతపై మాత్రం అనుమానాలు అలానే ఉండనున్నాయి!