అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. నవంబర్ 3న జరిగే ఎన్నికల కోసం ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున తిరిగి పోటీ చేస్తుండగా డెమోక్రాట్ పార్టీ తరుపున జో బిడెన్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు జరిపిన సర్వేలలో ట్రంప్ కంటే జో బిడెన్ ముందంజలో ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. కరోనాను అరికట్టడంలో విఫలం కావడంతో బాటు హెచ్1 వీసాల రద్దుతో మైగ్రంట్స్ ఓట్లు, జాత్యంకార హత్యతో నల్ల జాతీయుల ఓట్లను ట్రంప్ కోల్పోయాడని రాజకీయ మేధావులు వ్యాఖ్యనిస్తున్నారు. ఇదే సమయంలో డెమోక్రాట్ పార్టీ వేసిన మాస్టర్ ప్లాన్ కు ట్రంప్ విలవిలాడుతున్నాడు. భారత సంతతికి చెందిన కమల హారీస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడం డెమోక్రాట్ పార్టీకి పెద్ద ప్లస్ గా మారింది.
రెండో సారి కూడా ఎన్నికలలో గెలవాలని ఆశలు పెట్టుకున్న ట్రంప్ కు ఈ వరుస పరిణామాలు షాక్ నిస్తాయి. కరోనాకు కారణమంటూ చైనాని నిందిస్తూ ప్రజలలో సానుభూతిని పొందాలని ప్రయత్నించిన ట్రంప్ కు పెద్దగా లాభం చేకూరలేదని సర్వే ఫలితాలను చూస్తే అర్ధమవుతోంది. ఈ సమయంలో ట్రంప్ కు పెద్ద దిక్కుగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కనబడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో మోడీని తమ ప్రచారాయుధంగా చేసుకోవాలని ట్రంప్ ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలలో మోడీ పేరును విరివిగా వాడుతున్నాడు. ట్రంప్-మోడీ మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. ట్రంప్ కు మద్దుతుగా టైమ్ స్క్వేర్ లో మోడీ ప్రసంగించడం, మోడీ కోసమే తాను ఇండియా పర్యటనకు వచ్చానని ట్రంప్ చెప్పడం అందరికి గుర్తుండే ఉంటాయి.
గ్వాలన్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఇండియాకు మద్దతు ఇవ్వడం ఆ చర్యలలో భాగమే. ఎన్నికలలో గెలిచేందుకు ట్రంప్ ఎన్నైనా టక్కు టమారి విద్యలు చేసుకోవచ్చు కానీ మోడీ ఎందుకు ఒప్పుకున్నట్లు అనే ప్రశ్న అక్కడ స్థిరపడ్డ భారతీయులు అడుగుతున్నారు. అధికారంలోకి రాగానే హెచ్ 1 మార్గదర్శకాలను కఠినతరం చేయడమే గాక తాజాగా వీసాలను రద్దు చేసిన ట్రంప్ కు మద్దతు ఇవ్వరాదని వారు కోరుకుంటున్నారు. ట్రంప్ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన జో బిడెన్ కు మద్దతు పలకాలని మెజారిటీ భారతీయులు కోరుకుంటున్నారు. కమల హారిస్ కూడా భారత సంతతికి చెందిన వారు కావడం కూడా డెమోక్రాటిక్ పార్టీకి పెద్ద సానుకూలంశామనే చెప్పాలి. దీంతో ట్రంప్ కు ఓటమి భయం పట్టుకుంది. అమెరికా పౌరులకు మాత్రమే లబ్ది చేకూరేలా ఇన్నాళ్లు నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఎన్నికల సమయం రాగానే విదేశీయులు గుర్తుకు రావడమే అతని ఓటమికి నిదర్శనమని వ్యాఖ్యలు వినబడుతున్నాయి.