సంక్రాంతి సీజన్ వస్తోందనగానే… స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా బరిలోకి దిగిపోతాయి. అభిమానులు దాన్నే వేడుకగా ఫీలయిపోతారు. ఇక రిలీజ్ రోజు వస్తే ఆ సందడి మాటల్లో చెప్పలేం. థియేటర్స్ అన్నీ.. ఈలలు గోలలు చప్పట్లో దద్దరిల్లిపోతాయి. ప్రతీ ఏడాది ఓ అరడజను సినిమాల వరకూ ఆ లిస్ట్ లో ఉండడం ఆనవాయితీగా వస్తోంది. సినిమా హిట్టైతే.. బాక్సాఫీస్ కలెక్షన్ లెక్కలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి. కాస్త అటూ ఇటూ అయినా కూడా.. పండగ సీజన్ కాబట్టి.. నిర్మాతలు కాస్తంత ఊపిరిపీల్చుకుంటారు.
యాజ్ యూజువల్ గా ఈ ఏడాది కూడా మూడు చిత్రాలు విడుదలై.. కలెన్షన్ వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పలు చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. అయితే వచ్చే సంక్రాంతి స్పెషల్ ఏంటంటే.. ప్రతీ ఏడాది లా.. వచ్చే ఏడాది స్టార్ హీరోలు సందడి చేయలేకపోవడమే. కరోనా వైరస్ ఆ లెక్కలన్నిటీ మార్చిపడేసింది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి అందరికన్నా ముందుగా.. రాజమౌళి కర్చీఫ్ వేసుకున్నాడు.
తారక్, చెర్రీల క్రేజీ మల్టీస్టారర్ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో .. తిరిగి చిత్రీకరణ ప్రారంభించినా.. మరో ఆరునెలల వరకూ సినిమాల పూర్తి కాకపోవడం వల్ల ఆర్.ఆర్. ఆర్ సినిమా సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకుంది. ఆ మేరకు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు కూడా. ఇక చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రాలు సైతం అప్పటికి కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే.. రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు మొన్నీమధ్యే ఓటీటీలో విడుదలైపోయాయి.
అలాగే … బాలయ్య , బోయపాటి సినిమా కూడావచ్చే సంక్రాంతి విడుదలకు కష్టమే. ఇంకా నాగార్జున, వెంకటేశ్ సైతం వచ్చే సంక్రాంతి బరిలోకి దిగడం లేదు. దీంతో వచ్చే సంక్రాంతి సీజన్ అంతా కుర్రహీరోలదే అయిపోయింది. ఇక ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు గురించి చెప్పాలంటే.. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేని ‘రెడ్’ సినిమా వచ్చే సంక్రాంతికి బెర్త్ ఖాయం చేసుకుంది. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ కూడా 2021 సంక్రాంతికి విడుదలకాబోతోంది.
అలాగే.. నితిన్ , కీర్తి సురేశ్ ‘రంగ్ దే’, శర్వానంద్ ‘శ్రీకారం’, అల్లు అరవింద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం, సాయితేజ , దేవాకట్టా.. ‘భగవంతుడి సాక్షిగా’ చిత్రాలు సైతం.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. అయితే పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ చిత్రం గురించి క్లారిటీ లేదు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందో, ఓటీటీలో వస్తుందో తెలియని కన్ఫ్యూజన్ ఉంది. కరోనా పరిస్థితుల్ని బట్టి… రాబోయే రోజుల్లో ఈ సినిమాల విడుదలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి ఈ యంగ్ హీరోల్లో వచ్చే సంక్రాంతికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.