ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల కమిషనర్ ఆయా పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం తీసుకోవడం సర్వసాధారణం. సహజంగా ఈ ప్రక్రియ ఎన్నికలు జరపబోయే రెండు నెలల ముందు జరుగుతుంటుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడలోని తన కార్యాలయంలో వివిధ పార్టీల నేతలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. సహజంగా అన్నీ పార్టీల నేతలతో కమిషనర్ ఒకేసారి సమావేశం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఒక్కో పార్టీ ప్రతినిధికి పది నిమిషాల సమయం కేటాయించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు.
ఎవరేం చెప్పారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం 19 పార్టీలకు ఆహ్వానం పంపింది. ఇవాళ జరిగిన సమావేశానికి 11 పార్టీల నేతలు హాజరయ్యారు. జనసేన, జనతాదళ్ పార్టీలు మెయిల్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు వినతులు పంపాయి. అధికార వైసీపీ నుంచి ఈ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ, జనతాదళ్, ముస్లిం లీగ్ పార్టీలు కోరాయి. ఇక ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని సీపీఎం సూచించింది.
ఈ ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై విచారణ జరపాలని జనసేన పార్టీ మెయిల్ ద్వారా కమిషన్ ను కోరింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని సమాజ్‍వాదీ పార్టీ తెలిపింది.
ఏకగ్రీవాలన్నీ రద్దవుతాయా?
స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసింది. అయితే పాత నోటిఫికేషన్ కొనసాగుతుందా? లేదా? రద్దవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఆరు నెలలు మించి ఫోర్స్ లో ఉండదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇక గత మార్చిలో ఏకగ్రీవాలైన వాటిని కొనసాగిస్తారా? లేదంటే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే, ఏకగ్రీవాలు కూడా రద్దవుతాయా అనే అంశాలపై ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉంటే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఏకగ్రీవాలు ఉంటాయా? అవి కూడా రద్దవుతాయా అనేది కమిషనర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఎన్నికల నిర్వహణలో పారదర్శక విధానం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పారదర్శక విధానం అమలు చేస్తున్నామని, అయినా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం బాధ కలిగించిందని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సమావేశం కావడం రెగ్యులర్ విధానమని, ఇది మార్చుకోలేనిదని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ నేతలు హాజరకాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని నిమ్మగడ్డ వెల్లడించారు.
తీవ్రంగా నిరసించిన అంబటి
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్వహించిన సమావేశాన్ని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. నిమ్మగడ్డలోకి చంద్రబాబునాయుడు పరకాయ ప్రవేశం చేశారని ఆరోపించారు. చంద్రబాబు లక్ష్యాలకోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లుగా ఆరోపించారు.