అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీ తిరుమల వెంకటేశ్వరునికి సమర్పించే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరింది. అయితే ఈ వ్యవహారంలో దొంగే దొంగ .. దొంగ అన్నట్టుగా అప్పటి వైసీపీ నేతలు వ్యవహారిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే నెయ్యి కొనుగోలు వ్యవహారంలో అప్పటి టీటీడీ ఛైర్మన్‌ది ప్రధాన పాత్ర ఉంటుంది.
అయితే గతంలో టీటీడీ ఛైర్మన్లుగా పనిచేసిన వైసీపీ నేతలైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా తేలుకుట్టిన దొంగల్లాగా వ్యవహారిస్తున్నారు. వారిలో భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి.. తాము తప్పు చేసి ఉంటే.. తాను తన కుటుంబం సర్వనాశనమైపోవాలని శపధం చేశారు. వైవీ సుబ్బారెడ్డి అయితే ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవునెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లయి చేస్తోంది. అయితే ఈ సప్లయ్ వ్యవహారంలోనూ మతలబు జరిగిందనేది ఇప్పుడు బయటికొస్తోంది. ఆ మతలబులో అప్పటి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డే కీలక సూత్రధారిగా బయటికొస్తోంది. సిట్ విచారణలో ఇదే విషయం తేలినట్టు తెలుస్తోంది. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కల్తీ నెయ్యి సరఫరాపై తాను సేకరించిన వివరాలను కూడా బహిర్గతం చేశారు. ఐదు లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు 2023 అక్టోబరులో టీటీడీ టెండర్ పిలిస్తే.. చిత్తూరు జిల్లాలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ రివర్స్ టెండరింగ్‌లో కిలో రూ. 428.04కి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. అదే టెండర్‌లో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కిలోకు రూ. 432.96 కోట్ చేసి ఎల్3గా నిలిచింది.
నిబంధనల ప్రకారం ఎల్1గా ఉన్న.. వైష్ణవి డెయిరీ కోట్ చేసిన ధరకు నెయ్యి సరఫరా చేస్తే 35 శాతం ఆర్డర్ ఇస్తామని టీటీడీ ఏఆర్ డెయిరీ సంస్థకి చెప్పినప్పటికీ.. ఆ సంస్థ నెయ్యి సరఫరాకి ముందుకు రాలేదు. ఆ ధరకు తాము సరఫరా చేయలేమని 2023 నవంబరు 25న ఏఆర్ డెయిరీ సంస్థ స్పష్టం చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. అదే ఏఆర్ సంస్థ నాలుగు నెలలు తిరక్కుండానే 2024 మార్చిలో టీటీడీ పిలిచిన టెండర్లలో పాల్గొని.. నెయ్యి ధరను కిలో రూ. 320 చొప్పున కోట్ చేసి.. 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ దక్కించుకుంది. నాలుగు నెలల ముందు కిలో రూ. 428కి కూడా ఇవ్వలేమన్న సంస్థ.. ఆ తరువాత నాలుగు నెలలకే రూ. 320కే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా సరఫరా చేయగలదనేది అందరిని తొలుస్తున్న సందేహం.
కల్తీనెయ్యి వ్యవహారంపై వివరాలను సేకరించిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయంటూ పలు ఆధారాల్ని ఆయన బయటపెట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆ వేంకటేశ్వరస్వామికే అన్యాయం చేశారు. చేసిన తప్పునకు ఇప్పటికైనా క్షమాపణ కోరి, రాజకీయాల నుంచి వైదొలగాలని సూచించారు. కల్తీనెయ్యి వివరాలను వెల్లడిస్తూ.. 2023 ఫిబ్రవరిలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా.. అహ్మద్‌నగర్‌కు చెందిన మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ సంస్థకు కిలోకి రూ. 496.90 చొప్పున పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు టీటీడీ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.
ఆ తరువాత 2024 మార్చిలో భూమన కరుణాకరరెడ్డి హయాంలో ఏఆర్ డెయిరీకి కిలో రూ. 320 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏడాది కాలంలో నెయ్యి ధర రూ. 496 నుంచి రూ. 320కి పడిపోతుందా? కిలో రూ. 496కి కాంట్రాక్ట్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారా? లేకపోతే రేటు తగ్గించి భూమన తప్పు చేశారా? ఇద్దరిలో దొంగ ఎవరు? అవన్నీ బయటకు రావాలనే సిట్ వేశామని ఆనం మాట్లాడారు. కిలో నెయ్యికి రూ. 411కి టెండర్ వేసిన ఏఆర్ డెయిరీ సంస్థ రివర్స్ టెండరింగ్‌లో రూ. 320కి ఎలా తగ్గిస్తుంది? పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో 0.1 శాతం మాత్రమే తగ్గుతుందని… అదే టీటీడీలో మాత్రం ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్‌లో తగ్గించేస్తారని ప్రశ్నించారు.
2019 ఆగస్టు నుంచి 2024లో వైసీపీప్రభుత్వం గద్దె దిగేంత వరకు నెయ్యి కొనుగోళ్ల వివరాల్ని ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టారు. టీటీడీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఏఆర్ డెయిరీకి లేదన్నారు. వైష్టవి డెయిరీ నుంచి ఈ ఏడాది జులై 2న ‘ఏపీ 26 టీసీ 4779’ నంబరు గల ట్రక్కు 151889406707 వేబిల్లు నంబరుతో బయల్దేరిందని.. ఆ ట్రక్కులోనే తిరుమలకు చేర్చాల్సిన నెయ్యి ఉందన్నారు.
50 కి.మీ. దూరంలోని తిరుమలకు వెళ్లాల్సిన ఆ ట్రక్కు డ్రైవర్‌కు గూగుల్ మ్యాప్‌లో దారి తప్పుగా చూపించినట్టుందని చెబుతూ.. అదికాస్త కృష్ణగిరి, సేలం మీదుగా 508 కి.మీ. ప్రయాణించి దిండిగల్‌లోని ఏఆర్ ఫుడ్స్‌కు చేరింది. అదే ట్రక్కు కొత్త వేబిల్లు నంబరు 511673446306తో జులై 4న 3.27 గంటలకు ఏఆర్ ఫుడ్స్ నుంచి బయల్దేరి తిరుమలకు చేరుకుందన్నారు. దీని మర్మమేంటి? ఏఆర్ ఫుడ్స్ సంస్థ వైష్ణవి ఫుడ్స్ వంటి డెయిరీల నుంచి నెయ్యి కొని.. కొత్త వేబిల్లులతో టీటీడీకి పంపిస్తోందని కాదా అంటూ వైసీపీ నాయకులను ఆనం ప్రశ్నించారు.
నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిన తరవాత అప్పుడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి హడావుడి చేశారు. కొండపైకి వెళ్లిన కరుణాకర్ రెడ్డి .. తాము తప్పు చేసి ఉంటే… తాను తన కుటుంబం నాశనమైపోవాలని శపథం కూడా చేసి వచ్చారు. అయితే ఇప్పుడు బయటకొస్తున్న వివరాలతో.. అసలు నెయ్యి కల్తీ అంతా భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో జరిగినట్టుగా తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉన్న నెయ్యి సప్లయర్ ను.. భూమన టీటీడీ చైర్మన్ అయ్యాక మార్చేసి.. టెండర్ రూల్స్ కూడా మార్చేశారు.
తద్వారా ఏఆర్ డెయిరీతో ఒప్పందం చేసుకునేలా చేశారు. భూమనతో కంపెనీలు చేసుకున్న ఒప్పందం మేరకు ఆ కంపెనీలు నెయ్యిని ఏఆర్ డెయిరీకి పంపిస్తే.. ఏఆర్ డెయిరీ తమ పేరుతో తిరుమలకు పంపుతున్నారు. ఇందు కోసం రివర్స్ టెండరింగ్ లో భారీగా తగ్గింపు కూడా ఇప్పించారు. వివిధ సంస్థలు నెయ్యిని సేకరించడంతో పెద్ద ఎత్తున కల్తీతో పాటు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తులో ఇటువంటి ఎన్నో విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తేలుకుట్టిన దొంగలాగా.. భూమున హడావుడి చేయడానికి కారణంగా తెలుస్తోంది