అధికారంలో ఉన్నది మనమే కదా… అందరూ పనులు చేసుకోండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడంతో.. చేతిలో డబ్బులు లేకున్నా… అప్పులు చేసి మరీ ఆ పార్టీ శ్రేణులు పలు అభివృద్ధి పనులను చేశారు. తీరా బిల్లుల చెల్లింపు దగ్గరకొచ్చేసరికి వారికి నిరాశే మిగిలింది. సీఎంగా ఉన్నంత కాలం తాడేపల్లి పాలెస్ వదిలి జగన్ బయటకే రాలేదు. ఫలితంగా అధికారంలో ఉన్నంత దాకా బిల్లుల కోసం జగన్ ను అడిగే అవకాశమే దక్కలేదు. తీరా అధికారం నుంచి దిగిపోయాక జగన్ ను ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల విషయం గురించి ప్రస్తావించారు. ఈ మాట విన్నంతనే జగన్ స్పందించిన తీరు నిజంగానే వారిని హతాశులను చేసిందని చెప్పాలి. బిల్లులు ఇవ్వకపోగా… బిల్లుల గురించి ప్రస్తావించిన తమపైనే జగన్ అసహనం వ్యక్తం చేస్తే ఎలా అంటూ వారు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. అంతేకాకుండా పనులు ఇచ్చిన నేతే.. బిల్లుల గురించి ఇక మరిచిపోవాలన్నట్లుగా మాట్లాడితే… తాము ఎవరి దగ్గరకు పోవాలంటూ వారంతా ఒకింత ఆగ్రహావేశాలకు గురి అవుతున్నారు.
అయినా చేసిన పనులకు సంబంధించిన బిల్లు గురించి అడిగిన వైసీపీ శ్రేణులపై జగన్ ఏ రీతిన స్పందించారన్న విషయానికి వస్తే… “ఇంకా ఏంటన్నా..పెండింగ్ బిల్లుల గురించి అడుగుతావు? ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా”… .జగన్ అన్నారట. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తన సొంతూరు పులివెందులకు వచ్చిన జగన్… గడచిన 3 రోజులుగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఆయనను కలిసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా అన్ని గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. జగన్‌ని కలిసేందుకు ఇలా జనం తోసుకురాగా… జరిగిన తొక్కిసలాట కారణంగా కార్యాలయం కిటికీ అద్దం పగిలి.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చిాంది.
ఈ సందర్భంగా జగన్ సీఎంగా ఉండగా… పలు పనులు చేసిన చాలా మంది కాంట్రాక్టర్లు జగన్ ను కలిసేందుకు వచ్చారు. తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదన్న విషయాన్ని జగన్ కు చెప్పి ఎలాగోలా బిల్లులు విడుదల చేయించుకోవాలన్న ఆశతో వారు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఓ కాంట్రాక్టర్ జగన్ వద్దకు వచ్చి బిల్లుల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా తాను చేసిన పనులు, తనకు రావాల్సిన బిల్లుల గురించిన వివరాలను ఆయన జగన్ కు అందజేశారు. ఈ వివరాలను పరిశీలించినంతనే.. జగన్ అసహనానికి గురయ్యారు. ఇంకా బిల్లుల గురించి అడుగుతావేంటన్నా అంటూ ఆయనపై జగన్ చిర్రుబుర్రులాడారు.
జగన్ అలా అసహనానికి గురి కావడంతో సదరు చోటా కాంట్రాక్టర్ షాక్ కు గురయ్యారట. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోగా… ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ తమనే జగన్ ఎదురు ప్రశ్నించడం ఏమిటంటూ ఆయన ఒకింత అయోమయానికి గురయ్యారు. తాను సీఎంగా ఉన్నప్పుడే కదా వీరంతా పనులు చేసింది… వీరికి ఎలాగోలా బిల్లులు ఇప్పించాలన్న దిశగా ఆలోచించాల్సిన జగన్… ఇక బిల్లుల గురించి మరిచిపోండి అన్నట్లుగా మాట్లాడతారేమిటి అంటూ ఆ కాంట్రాక్టర్ ఆవేదనకు లోనయ్యారట. మొత్తంగా తన సొంత పార్టీ శ్రేణులపైనా అసహనం వ్యక్తం చేస్తున్న జగన్… వారికి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు.