భారత్‌లో వ్యాక్సిన్ జోరు మొదలైంది. కొత్త సంవత్సరం సందర్భంగా కొవిషీల్డ్ అనుమతులు జారీ దేశానికి తియ్యటి కబురును అందించింది భారతీయ డ్రగ్ కంట్రోలర్ సంస్థ. వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా గత వారంలో 5 రాష్ట్రాలలో డ్రై రన్‌ని విజయవంతంగా నిర్వహించిన కేంద్రం దేశ వ్యాప్త డ్రై రన్‌ను నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. డ్రై రన్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ వివరాలను కేత్రస్థాయిలో సేకరించి కొవిడ్ పోర్టర్లలో నమోదు చేయాల్సింది కేంద్రం సూచనలు జారీ చేసింది.
అసలేంటీ డ్రై రన్..
టీకా నిబంధనలను ప్రజలు, ఆరోగ్య సిబ్బందికి తెలియజేయడానికి నిర్వహించే ముందస్తు చర్యల్లో భాగమే డ్రై రన్. ఇలా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి ప్రజలు, సిబ్బంది వ్యాక్సిన్ సమయంలో పాటించాల్సిన నియమాలు తెలియజేస్తారు. నిజమైన వ్యాక్సిన్ అందించే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఎదురవకుండా ఉండడానికి ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుంది. అంతేకాదు.. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఏవైనా ప్రతికూల ఇబ్బందులు ఎదురైతే.. ఆరోగ్య సిబ్బంది తక్షణం స్పందించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి ద్వారా ప్రజలకు, సిబ్బందికి తెలియజేస్తారు.
116 జిల్లాలు.. 259 కేంద్రాలు..
దేశవ్యాప్తంగా 116 జిల్లాలను, 259 కేంద్రాలను ఎంపిక చేసింది కేంద్రం. వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలు జారీ చేస్తుంది. వ్యాక్సిన్ డ్రై రన్ నిరంతర పర్యవేక్షణ చేయడానికి బ్లాక్-లెవల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. వీటి ద్వారా పంపిణీ కేంద్రాల పనితీరు, వ్యాక్సిన్ అందించే విధానం పట్ల అవగాహాన, వ్యాక్సిన్ వికటిస్తే వెంటనే వైద్య సిబ్బంది అందించాల్సిన చికిత్స ఇలా పలురకాలుగా ఈ కేంద్రాలలో డ్రై రన్‌ని నిర్వహించబోతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో డ్రై రన్..
తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాలలో 3 కేంద్రాలలో వ్యాక్సిన్ ట్రయిల్ రన్‌కు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో సెంటర్ 25 మందికి చొప్పున ఎంచుకుని డ్రై రన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పరిధిలో నాంపల్లి ఆసుపత్రి, తిలక్ నగర్ పిహెచ్‌సిలో వ్యాక్సిన్ ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. గత వారంలో ఏపీ డ్రై రన్ విజయవంతం కావడంతో.. ప్రస్తుతం రాష్ట్రావ్యాప్తంగా డ్రై రన్‌కు ఏర్పాట్లు చేసింది ఏపీ ఆరోగ్య శాఖ. ప్రతి జిల్లాలో 3 కేంద్రాలను ఎంచుకుని డ్రై రన్‌కు సన్నాహాలు చేసింది ప్రభుత్వం. అందుకోసం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఆసుపత్రలు, పిహెచ్‌సి సెంటర్లను ఎంపిక చేసింది. ఒక్కో కేంద్రం పరిధిలో 25 మందికి డమ్మీ వ్యాక్సినేషన్ అందించి ట్రయిల్ నిర్వహణ పరిశీలించి కేంద్రానికి నివేదిక అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.