వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేదని చాటే మరో పరిణామం ఒకటి బయటికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోతే కనీసం హూందాగా మాట్లాడడం, వ్యవహరించడం కూడా మాజీ ముఖ్యమంత్రికి తెలియవని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల రోజు ప్రజా తీర్పుపై స్పందించిన సమయంలో ఎవరైనా ‘‘ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. తాము ఓడిపోయినప్పటికీ తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకుంటాం.. మళ్లీ జనాభిమానాన్ని చూరగొంటాం.. ప్రజల తరపున పోరాడడం మేం ఆపం’’ అనే మాటలు ఏ నాయకుడైనా మాట్లాడతారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనను ఓడించినందుకు ప్రజలపై పడి ఏడ్చారు.
ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిపోయి కొద్ది రోజులు బయటికి రాలేదు. తర్వాత అతి కష్టమ్మీద పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఓడిపోయిన, గెలిచిన నేతలను తన ప్యాలెస్ కు పిలిపించుకొని మాట్లాడారు. ఆ సమయంలో వారితో జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ‘ఎన్నికల ఫలితాలు చూశాక షాక్ అయ్యా.. ఇదేంటి.. ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటని? అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’ అని జగన్ మాట్లాడారట. గత వారం నిర్వహించిన సమావేశంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా బయటికొచ్చాయి.
ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో జగన్ ఈ మాటలు అన్నట్లు తెలిసింది. ‘నిజంగా హిమాలయాలకు వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా దాదాపు 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి.. అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలని అనిపించింది. మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతోనే మెల్లగా రిజల్ట్స్ షాక్ నుంచి బయటికొచ్చా. ఆ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందనేందుకు అనుమానాలు, కారణాలు ఉన్నాయి. కానీ ముందు మనం మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి’’ అని మాట్లాడారు.
తమ ఓటమిపై సర్వేలు చేయించామని.. వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదని.. అందువల్లే కాన్ఫిడెంట్‌గా పార్టీ కోసం ఇక్కడే ఉన్నానని జగన్ అన్నారు. ఇలాంటి దారుణ ఫలితాలు చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకుంటాను. నేను ఎలాగైతే షాక్ నుంచి బయటికొచ్చానో.. మీరు కూడా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం అవండి అంటూ జగన్ పార్టీ నేతల్లో నూరిపోశారు