అదిగో.. అలా జాగింగ్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్, షూతో అన్నింటినీ మించి మొహానికి మాస్కుతో అలా వాహ్యాళికి నడిచి వస్తున్నదెవరో గుర్తుపట్టారా? ఆయన ముప్పవరపు వెంకయ్యనాయుడు! నిజమే న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాస భవనంలో ఆయన వాకింగ్ చేస్తున్నప్పటి దృశ్యం ఇది. కొవిడ్ చికిత్స పొంది.. నెగటివ్‌గా తేలిన తర్వాత.. నిత్యం వ్యాయామాల్లో భాగంగా.. ఆయన వాకింగ్ చేస్తున్న దృశ్యమిది.
భారత ఉపరాష్ట్రపతి, వెంకయ్యనాయుడు కరోనా నుంచి కోలుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న ఎయిమ్స్ బృందం నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో వైద్యులు చెప్పిన జాగ్రత్తలను పాటించాలని వెంకయ్యనాయుడు నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే.. తాజాగా, ఉపరాష్ట్రపతి ట్విట్టర్ అకౌంట్ లో ఆసక్తికర ఫొటోలు దర్శనమిచ్చాయి.
ఎప్పుడూ తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించే వెంకయ్యనాయుడు తాజాగా జాగింగ్ డ్రెస్ ధరించి వాకింగ్ చేస్తూ కనిపించారు. ముఖానికి మాస్కు ధరించిన వెంకయ్య ఢిల్లీలోని తన అధికారిక నివాసం ఆవరణలో వాకింగ్ ట్రాక్ పై నడక సాగించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా వైరస్ ప్రభావం నుంచి తాను త్వరగా కోలుకోవడానికి ఫిజికల్ ఫిట్ నెస్, మానసిక బలంతో పాటు దేశీయ ఆహారం ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. డాక్టర్ల సూచనను కచ్చితంగా పాటించి, త్వరగా ఆరోగ్యం సంతరించుకున్నానని తెలిపారు.











