బాలీవుడ్ జంట ఇంట పెళ్లి భాజా మోగనుంది. వారెవరో కాదు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. బాలీవుడ్ లో హీరోహీరోయిన్లుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ జంట ఎట్టకేలకు ఓ ఇంటి వారు కాబోతున్నారు. డిసెంబరు 7 నుంచి 9 వరకూ మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక జరుగనుంది. ఈ ఏడాది బాలీవుడ్ లో జరిగే అతి పెద్ద పెళ్లి సందడి ఇది. రాజస్థాన్ లో వీరి పెళ్లికి సంబంధించి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి డిసెంబరు 9న జరుగనుంది. ఈ మూడు రోజులూ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి.
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా అనే రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరుగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి దాదాపు 200 మంది అతిథులు హాజరుకానున్నారు. బాలీవుడ్ లో వీరికి అతి సన్నిహితంగా ఉండే సెలబ్రిటీలకే ఆహ్వానాలు అందాయి. అతిథుల కోసం సోజత్ నుంచి ప్రత్యేక మెహందీని తెప్పిస్తున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే ఈ మెహందీని చేతితోనే తయారు చేశారట. దీన్ని ప్రకృతి సహజంగా తయారు చేస్తున్నట్టు సోజత్ మెహందీ సరఫరాదారులు చెబుతున్నారు.
20 కిలోల మెహందీ, 400 హెన్నా కోన్ లను వివాహ వేదిక వద్దకు పంపనున్నారు. ఇంతకుముందు ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రాల పెళ్లికి కూడా ఇదే మెహందీని వాడారు. ఈ వేడుకకు సంబంధించిన మీడియా కవరేజీని అనుమతించబోమని అంటున్నారు. అంతేకాదు పెళ్లి మండపానికి వచ్చే గెస్ట్ లకు కూడా మొబైల్ ఫోన్ లు అనుమతించకూడదని నిర్ణయించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను అతిథులు సోషల్ మీడియాలో లీక్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీపైనే ఉంటుంది.
ఫొటోలు ఏవీ లీక్ కాకుండా ఉండటం కోసం పెళ్లికి వచ్చే అతిథులు తమ ఫోన్ లను వారు నిర్దేశించిన చోట భద్రపరచాల్సి ఉంటుంది. సవాయ్ మాధోపూర్‌లోని వేదికలోకి వచ్చే ముందే ఈ తతంగమంతా జరుగుతుంది. ఈ పెళ్లికి సంబంధించి అధికారిక సమాచారం ఏదీ బయటకు రావడం లేదు. కత్రినా, విక్కీ కౌశల్ కూడా ఈ పెళ్లిపై మౌనంగానే ఉన్నారు. నిర్మాత కబీర్ ఖాన్ నివాసంలో దీపావళి సందర్భంగా రోకా వేడుకను జరుపుకున్నారు. ఈ వివాహ వేడుకకు ముందే ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకున్నట్టు సమాచారం. అంతా బాగానే ఉంది గానీ పెళ్లిని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.











