ఏపీలో త్వరలోనే ఖాళీ కానున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన కసరత్తును మొదలుపెట్టేసింది. ఏపీ శాసనమండలిలో పట్టభద్రుల కోటాలో కృష్ణా-గుంటూరు జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మల పదవీ కాలం వచ్చేఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈలోగానే ఆ స్థానాలకు కొత్త అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల కోసం టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. అయితే విపక్ష వైసీపీలో మాత్రం ఈ ఎన్నికల పట్ల అంతగా ఊపు కనిపించడం లేదు. ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్దతిన జరగనున్నాయి. గడచిన ఎన్నికల్లో ఈవీఎంల .సాయంతో కూటమి పార్టీలు గెలిచాయని గగ్గోలు పెడుతున్న వైసీపీ… తన వాదనను నిజం చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలి. లేదంటే.. కూటమి సర్కారుపై వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని ఒప్పేసుకోవాల్సి ఉంది.
ఇటీవలు ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు బలం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఆ ఎన్నికను ఈజీగానే గెలుచుకుంది. సాధారణంగా ఈ ఎన్నికల్లో ఓటేసిన వారంతా వైసీపీ హయాంలో ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వారే కావడంతో ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగానే ముగిసింది. అయితే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నెగ్గడం అంత ఈజీ కాదనే చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీలకే ఈ ఎన్నికల్లో పట్టభద్రులు చుక్కలు చూపిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా డిగ్రీ చదివిన వారే కావడంతో ఉద్యోగావకాశాలు కల్పించడం, నిరుద్యోగులకు ఇతరత్రా ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు… ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించి మరీ పట్టభద్రులు తమ ఓటును వేస్తారు. ఈ లెక్కన పట్టభద్రులను తమ వైపునకు తిప్పుకోవడం అంత ఈజీ కాదని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… ఈ ఎన్నికల కోసం వైసీపీ కాస్తంత ముందుగానే స్పందించింది. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఆ పార్టీకి చెందిన బెజవాడ నేత గౌతం రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఉభయ గోదావరి జిల్లాల స్థానానికి మాత్రం ఆ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ అదికార టీడీపీ శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా- గుంటూరు జిల్లాల స్థానం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖర్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. వీరి అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చేలా ఆయన కూటమిలోని బీజేపీ,జనసేన పార్టీల ఛీఫ్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన నెలల వ్యవధిలోనే జరగనున్న ఈ ఎన్నికల్లో టీడీపీని కాదని బీజేపీ, జనసేనలు వెళ్లే పరిస్థితి అయితే లేదు. మొత్తంగా కూటమి తరఫున ఆలపాటి, పేరాబత్తుల పేర్లు ఖరారైనట్టేనని చెప్పక తప్పదు.
కృష్ణా- గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోట కిందే లెక్క. గడచిన ఎన్నికల్లో వైసీపీని కూటమి పార్టీలు ఈ జిల్లాల్లో చిత్తుచిత్తుగా ఓడించాయి. ఈ జిల్లాల్లో అసలు వైసీపీ ప్రభావమే కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాకుండా పట్టభద్రుతను సంతోషపెట్టేలా వైసీపీ తన పాలనలో పెద్దగా చర్యలేమీ చేపట్టలేదు. జాబ్ కేలండర్ అని ఊరించి నిరుద్యోగులను నిండా ముంచేసిందనే చెప్పాలి. ఇక ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను కూడా వైసీపీ చూపలేకపోయింది. ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోియంది. ఇక అమరావతి నిర్మాణాన్ని ఎక్కడికక్కడే నిలిపేసి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు వైసీపీ విలన్ గా పరిణమించింది. ఇవన్నీ చూస్తుంటే…గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్న విశ్లేషణలుబలంగా వినిపిస్తున్నాయి. వెరసి లిట్మస్ టెస్ట్ లో వైసీపీ బొక్కబోర్లా పడక తప్పదని చెప్పవచ్చు.