విజయసాయి వార్నింగ్.. విడదల రజనీకా..?? సజ్జలకా..??
ఉత్తరాంధ్ర పార్టీ కో ఆర్డినేటర్‌గా కీలక బాధ్యతల నుండి తప్పించిన జగన్… రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి బాలినేని పోస్ట్ అప్పగించారు.. మంత్రి నుండి తప్పించిన తర్వాత బాలినేనిని జిల్లాల కో ఆర్డినేటర్‌గా నియమించారు. దీంతో, బాలినేని ఆ పదవికి గుడ్ బై చెప్పారు.. ఆ స్థానంలో బాలినేని పోస్ట్‌ని విజయసాయి రెడ్డికి అప్పగించారు జగన్. బాపట్ల, పల్నాడు, ఒంగోలు జిల్లాల కో ఆర్డినేటర్‌గా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా తన పాత పగలను తీర్చుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో తనకు జరిగిన అవమానాలకు ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నారనే చర్చ మొదలయింది..
ఇటీవల విజయసాయి రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీకి షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విడదల రజనీ సొంత నియోజకవర్గం చిలుకలూరిపేటపై సమీక్ష నిర్వహించిన విజయసాయి రెడ్డి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో వర్గ విబేధాలను పెంచి పోషిస్తున్నారని, కొందరిని మాత్రమే ప్రోత్సహిస్తూ, ఇతరులను పార్టీకి దూరం చేస్తున్నారని ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. గతంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలుకలూరిపేట నియోజకవర్గంలో పర్యటిస్తే ఆయనపై రాళ్ల దాడి జరిగింది.. దీనివెనక విడదల రజనీ ప్రమేయం ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. ఆ తరవాత ఈ ఇద్దరి మధ్య వైరం పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో విడదల రజనీకి విజయసాయి రెడ్డి సీరియస్‌గా క్లాస్ పీకారని, పరిస్థితులు చక్కదిద్దుకోవాలని హితవు పలికినట్లు పార్టీ సన్నిహిత వర్గాల కథనం..
రజనీపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఆమె వర్గీయులు మండిపడుతున్నారు. పార్టీ ప్రతిష్టను మంటగలపడానికి, ఆమెకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నవారిని దూరం పెట్టడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రజనీకి విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇవ్వడంపై కొందరు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.. పార్టీ కోసం రజనీ ఎంతో కృషి చేస్తున్నారని, జగన్ ఆశయాలు, పథకాలను ముందుకు తీసుకుపోవడానికి ఆమె శ్రమిస్తున్నారని తేల్చి చెబుతున్నారు ఆమె అభిమానులు.
విడదల రజనీపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం వెనక అనేక కారణాలు ఉన్నట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. విడదల రజనీ.. సజ్జల టీమ్‌గా ముద్ర పడ్డారు. తొలిసారిగా గెలిచిన ఆమెకు మంత్రి పదవి దక్కడం వెనక సజ్జల ఉన్నారని చెబుతుంటారు. అంతేకాదు, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. విడదల రజనీని విశాఖ ఇన్ చార్జ్ మంత్రిగా నియమించారు. ఇది కూడా సజ్జల నిర్ణయమే అనే చర్చ ఉంది.. ఆ సమయంలోనే విజయసాయి రెడ్డి వర్సెస్ సజ్జల, విడదల రజనీ మధ్య కోల్డ్ వార్ నడిచిందనే కథనాలు ఉన్నాయి. తాజాగా వారిపై ప్రతీకారం తీర్చుకునే చాన్స్ తనకు దక్కిందని, విడదల రజనీపై ఆగ్రహం వ్యక్తం చేయడం అంటే, సజ్జలని టార్గెట్ చేయడమే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొత్తమ్మీద, వైసీపీలో వర్గ విబేధాలు, అంతర్గత కుమ్ములాటలు వేడెక్కుతున్నాయనే చర్చ నడుస్తోంది. ఇవే ఆ పార్టీని పుట్టిముంచడం ఖాయమని, ఇటు ప్రజా వ్యతిరేకతకి, పార్టీ విబేధాలు కూడా తోడవుతుండడం, వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. మరి, ఈ విబేధాలు పార్టీని ఏ తీరాలకు చేరుస్తాయో చూడాలి..