తెలుగు దేశం పార్టీ.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన 9 నెలల్లోనే అధికార పగ్గాలు చేపట్టిన ఘన చరిత్ర కలిగిన పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగాయ ఆవిర్భవించి.. ఆ పార్టీకి అధికార పీఠం నుంచి దించేసి సంక్షేమ పాలన అంటే ఏమిటో చేసి చూపించిన పార్టీ. దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి రూపకల్పన చేసిన పార్టీ. మూడున్నర దశాబ్దాల ప్రస్థానంలో ఉత్థానపతనాలు ఎదురైనా ధైర్యంగా నిలుచున్న పార్టీ. అంతేకాదండోయ్.. 2014 ఎన్నికల్లో నవ్యాంధ్రలో విజయం ఖాయమని ధీమాతో సాగిన వైఎస్సార్సీపీని బోల్తా కొట్టించిన పార్టీ కూడా. అలాంటి పార్టీ చేతిలో ఓడిపోయిన వైఎస్సార్సీపీ.. ఇప్పుడు అదే పార్టీని రద్దు చేయాలంటూ కొత్త డిమాండ్లు అందుకుంది. రాజకీయాలన్నాక ఓటమి, గెలుపు సహజమేనన్న భావనను మరిచిన వైసీపీ.. ఏపీలో ప్రతిపక్షమే ఉండకూడదన్న రీతిలతో వ్యవహరిస్తున్న తీరు నవ్వులపాలు అవుతోంది. టీడీపీని రద్దు చేయాలంటూ ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తే.. అంతకు కాసేపటి ముందు అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మంత్రి బొత్స సత్యనారాయణ అదే డిమాండ్‌ను వినిపించారు. వెరసి సొంత పార్టీ నేతల ముందే ఈ ఇద్దరు నేతలు నవ్వులపాలయ్యారు.
నిర్వాచన్ సదన్‌కు సాయిరెడ్డి..
గంజాయికి అడ్డాగా ఏపీ మారుతోందన్న వ్యవహారంపై హాట్ హాట్ చర్చ సాగుతున్న వేళ.. ఢిల్లీలోని కేంద్ర ఎన్నిక సంఘం కార్యాలయం అయిన నిర్వాచన్ సదన్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన పార్టీ ఎంపీలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ గుర్తింపును రద్దు చేయమని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సాయిరెడ్డి.. అక్కడే మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌పైనా, వైసీపీ నేతలపైనా టీడీపీకి చెందిన దేవినేని ఉమా, బొండా ఉమా, అయ్యన్నపాత్రుడు, పట్టాభి తదితరులు అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీకీ ఫిర్యాదు చేసినట్టుగా సాయిరెడ్డి చెప్పారు. ఈ కారణంగా టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరినట్లుగా ఆయన చెప్పారు. తమ ఫిర్యాదును విని ఎన్నికల కమిషనర్లు షాక్ తిన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఏపీ శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని, అందుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లుగా చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఈసీ నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని సాయిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఏపీలో రాజుకున్న వేడికి అసలు కారణం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు కారణమైతే.. ఆయన పేరునే సాయిరెడ్డి మరిచిపోయారు. ఎవరో పక్కనుండి అందిస్తే గానీ.. పట్టాభి పేరును సాయిరెడ్డి ప్రస్తావించలేకపోయారు.
కేబినెట్ భేటీలో బొత్స
ఇదిలా ఉంటే.. అమరావతిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎంత మంది మంత్రులు హాజరయ్యారో తెలియదు గానీ.. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ హాజురయ్యారు. భేటీలో భాగంగా మావోయిస్టులపై నిషేధంపై చర్చ సందర్భంగా బొత్స ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారట. సీఎంపైనే అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్న టీడీపీపై కూడా మావోయిస్టుల మాదిరే నిషేధం విధిస్తే సరిపోతుందని, ఆ దిశగా ఆలోచించాలని సీఎంకు సూచించారట. ఈ మాట విన్నంతనే జగన్ ఓ చిరునవ్వు చిందిస్తే.. సీనియర్ రాజకీయవేత్త అయి ఉండి ఇవేం వ్యాఖ్యలన్నట్లుగా మంత్రులు బొత్సను చూసి నవ్వారట. మొత్తంగా టీడీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ డిమాండ్ చేసి ఢిల్లీలో సాయిరెడ్డి, టీడీపీపై నిషేధం విధించాలని కేబినెట్ భేటీలో ప్రస్తావించి అమరావతిలో బొత్స నవ్వులపాలైనట్లే కదా.