వినేశ్ ఫొగాట్.. సుమారు ఏడాది తర్వాత బరిలోకి దిగింది. ఆకలి గొన్న పులిలా విరుచుకు పడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. కోలుకునే అవకాశం లేకుండా మట్టి కరిపించింది. భారత్‌కు మరో పసిడిని సాధించి పెట్టింది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. ఉక్రెయిన్‌లో జరిగిన టోర్నీలో సత్తా చాటింది. ఉక్రెయిన్ రెజ్లర్స్, కోచెస్ మొమోరియల్ టోర్నీ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ వి.కలడ్‌జిన్‌స్కే (బెలారస్)ను వినేశ్ చిత్తు చేసింది. తుదిపోరు ప్రారంభంలో 4-0తో వినేశ్ దూసుకెళ్లగా.. పోటీలోకి వచ్చిన బెలారస్ రెజ్లర్ 4-4తో సమం చేసింది. అయితే, ఆ తర్వాత దూకుడు కనబరిచిన ఫొగాట్ ఏ దశలోనూ పట్టువిడువలేదు. 6-4, 10-8.. ఇలా ఆధిపత్యం కొనసాగిస్తూ చివరికి విజయం సాధించింది.
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా రెజ్లర్‌గా ఉన్న వినేశ్ ఫొగాట్.. మార్చి 4 నుంచి 7 వరకు ఇటలీలో జరిగే యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో పాల్గొననుంది.











