విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్ కి మకాం మార్చనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా (స్పిరీచువల్ రీసెర్చ్ సెంటర్) తీర్చిదిద్దుతామని స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. ఈ కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల అద్వైత తత్త్వంపై పరిశోధనలు చేస్తానని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా స్వరూపానందేంద్ర ఈ విషయాన్ని ప్రకటించారు. తన వచ్చే పుట్టిన రోజు హైదరాబాద్ లోనే అని, విశాఖలో ఇదే ఆఖరి పుట్టిన రోజని చెప్పారు.
1997లో విశాఖ శారదా పీఠాన్ని ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి.. ఇందులో అనేక దేవాలయాలను ఏర్పాటు చేశారు. రాజ శ్యామల దేవికి భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం ఇక్కడ ఉంది. రాజా శ్యామల దేవి దేవతను కిరీటానికి చిహ్నంగా భావిస్తారు. అధికారం కోసం రాజశ్యామల యాగం చేపడుతుంటారు. అప్పటి నుంచి విశాఖ శారదా పీఠాధిపతిగా స్వరూపానందేద్ర కొనసాగుతూ అక్కడే నివాసం ఉంటున్నారు.
అయితే, ముఖ్యమంత్రి జగన్‌తో స్వరూపానందేంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో మాత్రం లేవు. స్వరూపానందేద్రను చంద్రబాబు బహిరంగంగానే విమర్శించేవారు. క్షుద్రపూజలు చేసి తనను అంతం చేస్తానని స్వరూపానందేంద్ర అనేవారని చంద్రబాబు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. సర్వ త్యాగాలు చేసే వారు స్వాములని, సకల భోగాలు అనుభవించేవారు దొంగ స్వాములని స్వరూపానందేంద్రను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. స్వాములు సాధారణ జీవితం, కోరికలకు అతీతం, దురాశ కూడదు అనే సూత్రాలు బోధిస్తూ విలాసవంతమైన జీవితం అనుభవించడం ఏంటని కొన్నేళ్ల క్రితం స్వరూపానందేంద్ర ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ప్రశ్న కూడా ఎదుర్కొన్నారు. అప్పుడాయన సమాధానం చెప్తూ తన కారు విలాసవంతంగా ఉండవచ్చు కానీ, మిగతా విషయాల్లో సాధారణమే అని చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని స్వరూపానందేంద్ర డిసైడ్ అయిపోయినట్లు అర్థం అవుతోంది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వస్తే ఆయన తనకు అనుకూలం కాదు కాబట్టి, భవిష్యత్తులో సమస్యలు ఎదువుతాయని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే స్వరూపానందేంద్ర విశాఖ నుంచి హైదరాబాద్ కు మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.