ప్రముఖ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి భవిష్యత్తుకి ముఖ్యమంత్రి జగన్ గ్యారంటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ఆయన చేసిన, చేస్తున్న, చేయబోతున్న పనులకు జగన్ ఇప్పుడే గ్యారంటీ ఇస్తున్నట్లుగా సమాచారం. ఆ కాంట్రాక్టులకు సంబంధించి వచ్చే ఏడాది ఆగస్ట్ వరకు పలు విడతల వారీగా డేట్లు వేసి మరీ జగన్ సర్కార్ చెక్కులు రాసి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటు చంద్రబాబు ఏపీ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తుంటే, జగన్ మాత్రం మేఘా కృష్ణా రెడ్డి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మేఘా కృష్ణా రెడ్డికి ముఖ్యమంత్రి జగన్‌తో మంచి అనుబంధం ఉంది. ఏపీలో పోలవరం పనులు సహా, అన్నమయ్య డ్యాం నిర్మాణ పనులు మేఘా కంపెనీనే చేపడుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను నవయుగ నుంచి మేఘాకు చెందిన మెయిల్ కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. 2021లో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే ఆ పనులు కూడా మెయిల్ కే ఇచ్చారు. దానికి మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఆ డ్యాం పనులు మాత్రం మొదలు కాలేదు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులైతే సరేసరి.
ఏ ప్రాజెక్టు అయినా కాంట్రాక్టర్లు నిర్మిస్తుంటే అవి పూర్తి అవుతున్న కొద్దీ ప్రభుత్వాలు బిల్లులు చెల్లిస్తూ ఉంటాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం దానికి కేటాయింపు జరుగుతున్న నిధులను బట్టి పనులు ముందుకు వెళ్తుంటాయి. కానీ, కృష్ణా రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం ముందే పరోక్షంగా దోచిపెడుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఫలానా తేదీల్లో చెల్లిస్తామని గ్యారంటీ చెక్కులు ఇస్తున్నారు. వాటిని తీసుకెళ్లి మేఘా కృష్ణారెడ్డి బ్యాంకులో తనఖా పెట్టుకొని రుణాలు పొందుతున్నారని సమాచారం. ఆ అప్పులు మెయిల్ కంపెనీ కట్టకపోతే వాటిని ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబును అసలు ఆధారాలే లేని, నిలబడని కేసులో ఇరికించిన జగన్మోహన్ రెడ్డి, తాను చేస్తున్న ఈ తప్పులను సమీక్షించుకోవాల్సి ఉంది. ఆయన ప్రతి విధానంలో లొసుగులు, ప్రతి కాంట్రాక్ట్ లో అస్మదీయులకు మంచి చేస్తున్న విధానాలు బయటికి వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే, ఎన్నికల తర్వాత ఆయన కేసుల్లో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.