ఏపీలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో ఫస్ట్ AI ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్..కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. TCSకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని చెప్పిన లోకేష్..TCSకు భూముల కేటాయింపు తర్వాతే అనేక సంస్థలు ఏపీకి క్యూ కట్టాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో బెస్ట్ ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకువచ్చామన్నారు.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్..బుల్లెట్ రైలులా దూసుకెళ్తొందన్నారు నారా లోకేష్. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ, కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. కేంద్రం చేపట్టే సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు 80 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని…పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేసేలా కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖలో పెట్టుబడులపై 3 నెలల్లో మరిన్ని ప్రకటనలు వస్తాయని గుడ్‌న్యూస్ చెప్పారు. రాజకీయ, అధికార పొరపాట్లతో ఏ ఒక్క పెట్టుబడి కూడా ఏపీ చేజారకూడదనేదే తన లక్ష్యమన్నారు. విశాఖను GCC రాజధానిగా చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే.. విశాఖ అభివృద్ధికి కేవలం పదేళ్లు చాలన్నారు లోకేష్. హైదరాబాద్ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అని వివరించారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. పెట్టుబడుల సాధనలో చరిత్ర తిరగరాస్తామనే నమ్మకం ఉంది. రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు లోకేష్. వీటిలో దాదాపు 50 శాతం విశాఖకే వస్తాయన్నారు.
దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ విశాఖకు రాబోతోందని చెప్పారు లోకేష్. త్వరలో దిల్లీలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నామని చెప్పారు. 4 జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగ్నిజెంట్, గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు విశాఖకు వస్తున్నాయన్నారు











