‘వస్తే కొండ.. పోతే వెంట్రుక..’ ఇదీ.. ఇన్నాళ్లూ బీజేపీ అనుసరించిన ఎలక్షన్ స్టంట్. బలం ఉన్నచోటా.. లేనిచోటా.. సీటు వచ్చినా.. రాకున్నా.. హిందూత్వ అజెండాను ప్రచారం చేస్తూ వెళ్లింది నాయకత్వం. కానీ.. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితి మొత్తం మారి పోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్‌ఎస్, ఎంఐఎంలను పదునైన పదజాలంతో దునుమాడుతూ.. రెచ్చగొట్టే వైఖరిని అవలంభించింది కమల దళం. హిందూత్వ అజెండాను ముందు పెట్టి.. ఇరు పార్టీల నేతలను నేరుగా టార్గెట్ చేసింది. అయితే.. దీన్ని ఊహించలేదో.. లేదంటే, వారిది కూడా మరో వ్యూహం అనుకున్నారో తెలియదు కానీ.. రెండు పార్టీల నేతలూ ఈ ట్రాప్‌లో పడిపోయారు. కౌంటర్.. ఎన్ కౌంటర్.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో బీజేపీకి అనూహ్యంగా పాపులారిటీ వచ్చేందుకు తోడ్పడ్డారు. దాని పర్యవసానం ఏంటో.. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
ఓరుగల్లుపై కన్ను..
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణుల్లో వచ్చిన ఊపు అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో అధికారానికి అడుగు దూరంలో ఉన్నామన్న భావనలో ఉంది పార్టీ నాయకత్వం కూడా. ఈ క్రమంలోనే.. రాబోయే ఎన్నికల్లోనే సత్తా చాటడానికి సమాయత్తమైంది. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ.
ఇక్కడా అదే వ్యూహం..?
రెండు రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్‌లో పర్యటించారు. కార్పొరేషన్ ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయడం.. జనాల్లో చర్చ షురూ చేయడం అన్నకోణంలో ముందస్తుగా ఓరుగల్లు వెళ్లొచ్చారు సంజయ్. ఇక్కడ కూడా ఆయన దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే.. మరింత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, కేసీఆర్ మందు తాగి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అనేశారు. ‘కేసీఆర్ దగుల్బాజీ ముఖ్యమంత్రి, బడా చోర్ ముఖ్యమంత్రి’ అన్నారు. కేసీఆర్ తోపుగాడు ఏం కాదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్.
ఆవేశంతో చేసిన వ్యాఖ్యలా..?
సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏదో ఆవేశంలో అన్న మాటలుగా కొట్టిపారేయడానికి లేదు. ఆయన గల్లీ లీడరేం కాదు.. లైట్ తీసుకోవడానికి! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి.. ప్రతి మాటను ఆచితూచి మాట్లాడతారు. ఎన్నికల సమయం కాబట్టి అందులో వ్యూహం తప్పకుండా ఉంటుంది. ఈ కోణంలో ఆలోచిస్తే.. జీహెచ్ఎంసీ స్ట్రాటజీనే.. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించిన రెచ్చగొట్టుడు వ్యూహాన్ని అమలు చేసి.. ప్రత్యర్థులను మాటల యుద్ధంలోకి దించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తద్వారా జనాల్లో బీజేపీని చర్చకు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఒక వేళ.. టీఆర్‌ఎస్, ఇతర ప్రత్యర్థులు ఈ వ్యూహానికి స్పందించకపోతే.. ‘మౌనం అంగీకారం’ అనే సూత్రాన్ని తెరపైకి తెచ్చి, వాళ్లు తప్పు చేశారు కాబట్టే స్పందించట్లేదంటూ ఎన్నికల యుద్ధాన్ని ముగించాలని కాషాయ దళం చూస్తోందనేది విశ్లేషకుల మాట.
అభివృద్ధి పైనా తూటాలు..
వరంగల్ అభివృద్ధిపై కూడా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. నగరాన్ని ఏపాటి అభివృద్ధి చేశారో.. భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయాలని, వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికి సిద్ధమా? అని సవాల్ విసిరారు బండి. హైదరాబాద్‌లో వరద బాధితులకు రూ.10 వేలు ఇచ్చిన కేసీఆర్.. వరంగల్లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.196 కోట్ల రూపాయలను ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించి కేవలం నలభై కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని బండి ఆరోపించారు. వరంగల్‌లో బీజేపీ గెలువబోతుందని సర్వేలు చెప్తున్నాయంటూ పార్టీకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
బీజేపీ బలం ఎంత..?
వాస్తవానికి వరంగల్‌లో బీజేపీ బలం చాలా స్వల్పం. 2016 వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 58 డివిజన్లకు గానూ ఆ పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. టీఆర్ఎస్ 44 స్థానాలను కైవసం చేసుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. మరి, ఒక్క స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ను ఓడించడం అంత తేలిక కాదు. అయితే.. దీనికి జీహెచ్ఎంసీ ఫలితాలను సూచిస్తున్నారు కాషాయ నేతలు. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలకు పెరిగినట్టే.. ఇక్కడ కూడా సత్తా చాటుతామని అంటున్నారు. అయితే.. హైదరాబాద్‌కు, వరంగల్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తేడా ఉంటాయి. కాబట్టి.. అక్కడి ఫలితం ఇక్కడ ఎంతమేర పునరావృతం అవుతుందన్నది తెలియదు. అయితే.. బీజేపీ మాత్రం ఆ జోరు కొనసాగిస్తామని ప్రచారం చేస్తోంది.
వలసలపైనే దృష్టి..
అయితే.. ఎన్ని చెప్పినా స్థానికంగా బలం లేదని నాయకత్వానికి తెలుసు కాబట్టి.. ఆ లోటును పూడ్చుకోవడం ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. ఇందు కోసం ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పని చేసిన, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన 37 వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకూ పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు తమ పార్టీ కండువా కప్పేందుకు బీజేపీ నాయకత్వం చూస్తోంది. తద్వారా కొంత బలం పెంచుకుని, మరికొంత దుబ్బాక, జీహెచ్ఎంసీ జోరును వాడుకుని వరంగల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. చూడాలి మరి.. ఈ స్ట్రాటజీ ఎంత మేర వర్కవుట్ అవుతుందో..?!











