ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత నటిస్తోన్న మరో యాక్షన్ థ్రిల్లర్ ‘రెడ్’. తమిళ హిట్ మూవీ ‘తడం’ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిశోర్ నిర్మించారు. మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృత అయ్యర్ కథానాయికలు గా నటిస్తోన్న ఈ సినిమా మొత్తం ఏడు భాషల్లో విడుదల కాబోతోంది.
తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, బెంగాలి, భోజ్ పురి, మరాఠీతో పాటు హిందీలో సైతం విడుదల కానుంది రెడ్. కన్నడ వెర్షన్ తెలుగుతో పాటు ఈ నెల 14నే విడుదల కానుండగా.. మిగిలిన భాషల్లో ఈ నెలాఖరున విడుదల చేయబోతున్నారు మేకర్స్. అయితే తమిళ వెర్షన్ మాత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతుంది. రామ్ కి ఇతర భాషల్లో ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. ఇలా మొత్తం ఏడు భాషల్లో రెడ్ ను విడుదల చేస్తున్నారు.
ఇక.. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అతడికి మంచి క్రేజుండడంతో అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో సైతం రెడ్ విడుదల కాబోతుండడం విశేషం. ఇటీవల విడుదలయిన రెడ్ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో.. సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. మరి రామ్ .. ఈ సంక్రాంతికి రెడ్ తో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Must Read ;- రామ్ ను ‘రెడ్’ చూపులతో పడేస్తున్న మాళవికా శర్మ