మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన వెన్నంటే నడిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి వైసీపీ అధిష్ఠానం నుంచి మొండిచెయ్యే ఎదురైంది. అదీకాక తనను కాదని, నియోజకవర్గంలో మరో నేత గంజి చిరంజీవికి జగన్ ప్రాధాన్యం ఇస్తుండడాన్ని ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తట్టుకోలేకపోయారు. దీంతో కలత చెందిన నాలుగు రోజుల క్రితం వైసీపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం చంద్రబాబుపై వివిధ కేసులు పెట్టి కోర్టులకు వెళ్లినప్పటికి ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి సీఎం నుంచి ఆదరణ దక్కలేదు. దీంతో మిగతా ఎమ్మెల్యేలు, నేతలు కూడా తమ పరిస్థితి ఏంటో అని బెంగపడుతున్నారు.
అయితే, ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి మంగళగిరిలో తన రాజకీయ భవిష్యత్తుకు ఎలా అడుగులు వేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తొలుత ఆర్కే జగన్ పై ఒత్తిడి తేనున్నట్లుగా తెలుస్తోంది. ముందు మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ నుంచే ప్రయత్నాలు చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం జగన్ పై అలిగి ఆర్కే రాజీనామా చేశారు కానీ, ఆయన రాజీనామాలు ఇంకా ఆమోదం పొందినట్టు లేదు. తమ నాయకుడిపై ఆరోపణలు, అసహన వ్యాఖ్యలు లాంటివి ఏమీ చేయలేదు. కాబట్టి, జగన్ నుంచి మళ్లీ టికెట్ రాబట్టుకునే అవకాశం ఆయనకు ఉంది. వైసీపీకి రామక్రిష్ణా రెడ్డి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్న తన ఇంట్లో పార్టీ నేతలతో కలిసి ఆర్కే సమావేశం నిర్వహించారు.
మూడోసారి కూడా మంగళగిరి నుంచి పోటీచేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే, రెండు రోజుల తర్వాత ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తానని నేతలకు ఆర్కే స్పష్టం చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఆర్కే అక్కడి నుంచి బరిలో లేకపోతే, టీడీపీ తరపున పోటీ చేసే నారా లోకేశ్ సునాయసంగా మంగళగిరిలో ఈసారి గెలుస్తారని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఆర్కేకు వైసీపీ నుంచి పూర్తిగా బయటికి వెళ్లిపోయే ఆలోచన లేదనేది కూడా ఓ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ఆర్కేకు తెలుగుదేశం, జనసేనల్లోకి ఎంట్రీ కూడా ఉండదనే సంగతి ఆయనకి కూడా తెలుసు. వైసీపీకి రాజీనామా చేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. తాను సమర్పించిన రాజీనామాల విషయంలో జగన్ కనుక దిగి రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే దిశగా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.











