నిన్నమొన్నటిదాకా పార్టీలో పెద్దపీట వేయించుకుని అధికారం చెలాయించిన చిన్నమ్మ.. ఇప్పుడు చిన్నపీటకే పరిమితమైంది. బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరిని ఏపీ బీజేపీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ ప్రకటించిన 40 మంది టీంలో పురంధేశ్వరి తాలూకు వ్యక్తులు లేకపోవడం ఊహాగానాలకు తావిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీలో పురంధేశ్వరికి కీలక పదవి దక్కుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా ఆచరణలోకి మాత్రం రాలేదు. దీంతో ఇక బీజేపీలో పురంధేశ్వరి ప్రభ తగ్గినట్టేని తెలుస్తోంది.
సోము వీర్రాజుకు ఇష్టంలేదా?
ఏపీ బీజేపీ పగ్గాలు సోము వీర్రాజుకు అప్పగించకుండా అడ్డుపడ్డ టీంలో పురంధేశ్వరి కూడా ఉన్నారని వినికిడి. ఒక దశలో ఆమె స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షస్థానం ఆశిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పురంధేశ్వరిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. గత రెండు, మూడు నెలలుగా పురంధేశ్వరి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కనీసం ఒక ప్రకటన కూడా మీడియాకు విడుదల చేసిన సందర్భం లేదనే చెప్పాలి. ఒక్క అంతర్వేది ఘటనలో పార్టీపై మంత్రి వ్యాఖ్యలకు ఆమె కౌంటరివ్వడం మాత్రమే జరిగింది.
కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా ఆ తరవాత స్థానంలో పురంధేశ్వరి ఉండే వారు. ఏ కార్యక్రమం జరిగినా కన్నాతోపాటు, పురంధేశ్వరి కూడా స్టేజీ పంచుకునేవారు. కన్నాను ఎప్పుడైనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పీకారో అప్పుడే పురంధేశ్వరి కూడా సైలెంట్ అయ్యారు. దీంతో ఇక పురంధేశ్వరి పని అయిపోయినట్టేనని భావిచాల్సి వస్తోంది.
కన్నాకు, పురంధేశ్వరికి జాతీయ బీజేపీలో స్థానం దక్కుతుందా?
ఏపీ బీజేపీ పదవి పోయినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయ్యారు. కనీసం మాట మాత్రం చెప్పకుండా రాత్రికి రాత్రి పదవి పోవడంపై ఆయన అప్ సెట్ అయ్యారట. కానీ చేసేది ఏమీ లేదు. అటు వైసీపీలోకి, ఇటు టీడీపీలోకి వెళ్లలేరు. కాబట్టి చావో రేవో బీజేపీలోనే తేల్చుకోవాలని కన్నా డిసైడ్ అయ్యారట.
అందుకే బీజేపీ జాతీయకమిటీలో తనకు కీలక పదవి దక్కనుందని కన్నా సన్నిహితుల వద్ద ప్రచారం చేసుకుంటున్నారట. ఇక పురంధేశ్వరి విషయానికి వస్తే ఆమెను బీజేపీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అమరావతి రాజధాని విషయంలో ఆమె రైతులకు పూర్తి మద్దతు ఇవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
వైసీపీని విమర్శించడమే ఆమె చేసిన నేరమా?
అమరావతే రాజధానిగా ఉంటుందని, మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన పురంధేశ్వరి, ఆమాటలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. వైసీపీని తీవ్రంగా విమర్శించిన బీజేపీ నేతలను ఆ పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పించింది. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ, బీజేపీ సంబంధాలు ఎలా పటిష్టంగా కొనసాగుతున్నాయో. రాజ్యసభలో బీజేపీకి సరైన మెజారిటీ లేకపోవడంతో అనేక బిల్లులు నెగ్గేందుకు వైసీపీ సాయం తీసుకుంటోంది.
ఈ సమయంలో ఏపీలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేయడాన్ని కేంద్ర బీజేపీ పెద్దలు సహించడం లేదట. అందుకే వైసీపీపై విరుచుకుపడితే.. పదవి ఊడిపోతుందనే సంకేతాలిచ్చారట. ఇవి గ్రహించిన సోము వైసీపీ ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట అనడం లేదు. కేంద్ర పెద్దల ఆలోచనలను ముందే గ్రహించడం వల్లే సోము ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాగలిగారని సమాచారం.
అయితే ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరగడంతో ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్, వీహెచ్ పీలు సోము తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. అయితే వైసీపీ నేతల అండతో ఆయన పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదని సమాచారం.











