‘ఎవరు షూట్ చేయాలో నేను మీకు చెప్పను.. నేనే సినిమా చేయాలో మీరు నాకు చెప్పకండి’ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? కింగ్ ఖాన్ షారుక్. ఎవరితో అన్నాడో తెలుసా? మాఫియా డాన్ అబూ సలేంతో. ఎందుకలా అనాల్సి వచ్చిందో మీకు ప్రత్యేకంగా వివరించనక్కరలేదనుకుంటా. బాలీవుడ్ రారాజు షారూఖ్ ఖాన్ దాదాపు 25 నుంచి బాలీవుడ్ ను ఏలుతున్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకంలో ఓ అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
సినిమాలు చేసే విషయంలో ఆయన గ్యాంగ్‌స్టర్లు అబూ సలేం, చోటా షకీల్ తదితరుల బెదిరింపు కాల్స్ ను ఎదుర్కోవలసి వచ్చేది. వారు కొందరు నిర్మాతల పేర్లు చెప్పి వారికి సినిమాలు చేయాలని కోరే వారట. అనుపమా చోప్రా రాసిన ‘ది కింగ్ ఆఫ్ బాలీవుడ్’ పుస్తకంలో ఇలాంటి ప్రస్తావన ఉంది. షారూఖ్ తనకు చెప్పిన విషయాలనే ఆమె తన పుస్తకంలో రాసింది. అబూ సలేం తనకు సనిహితుడైన ఓ నిర్మాతకు సినిమా చేయాలని అడిగాడట. దానికి షారుఖ్
‘నేను మీకు చెప్పను ఎవరు షూట్ చేయాలో.. కాబట్టి ఏ సినిమా చేయాలో నాకు చెప్పకండి’ అని చిన్నపాటి హెచ్చరిక చేశాడట. అప్పటినుంచే ముంబయి పోలీసులు షారుఖ్ కు భద్రత కల్పించారు. మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్‌లతో కలిసి ఆయన చేసిన సూపర్ హిట్ చిత్రాలలో ఒకటైన యశ్ చోప్రా ‘దిల్ తో పాగల్ హై’ చేస్తున్నప్పటి నుంచి షారుక్ ఖాన్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ లాంటివి వచ్చేవట. ఈ పుస్తకంలో షారుక్ జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని ఎన్నో అంశాలను అనుపమా చోప్రా రాసింది.











