తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రసాద్ శిరోముండనం ఈ వ్యవహారంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. ఇలా అనడం కంటే ప్రసాద్ రాసిన లేఖకు రాష్ట్రపతి స్పందించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు ఆదేశించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆ ఆదేశాలకు వెంటనే.. తలొగ్గి స్పందిస్తుందా అనేది అనుమానమే!
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో శిరోముండనానికి గురైన ప్రసాద్ అనే దళితుడు.. నిజంగానే ప్రభుత్వంలో పెత్తనం చెలాయించగల శక్తుల అరాచకానికి బలయ్యాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రసాద్ పట్ల అమానుషంగా ప్రవర్తించడం అనేది స్వయంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ నాయకుడు చేసి ఉంటే గనుక.. సామాజిక అసమతుల్యతకు అరాచకానికి నిదర్శనంగా అది ఉండేది. అప్పుడు పోరాటం ఇంకోరకంగా సాగి ఉండేది. కానీ.. ఆ నాయకుడు పోలీసులను ప్రభావితం చేసి.. వారిద్వారా ఆ దళితుడికి శిరోముండనం చేయించాడు. ఒక లోకల్, ఛోటా నాయకుడు ఒత్తిడి చేయగానే.. ఇలాంటి అమానుషమైన పనికి పోలీసు ఎస్ఐ ఎలా తెగించారనేది ఇంకో పార్శ్వం. ప్రభుత్వం- ఆ ఎస్ఐ ను సస్పెండ్ చేసింది గానీ.. పార్టీ- ఆ నాయకుడిని ఏమీ చేయలేకపోయింది.
అయితే ప్రసాద్ న్యాయంకోసం రాష్ట్రపతికి లేఖ రాశాడు. తనకు న్యాయం జరగకపోతే నక్సలైట్లలో చేరిపోవాలని ఉన్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దానికి స్పందనగా రాష్ట్రపతిని నుంచి జీఏడీ శాఖలోని సహాయ కార్యదర్శి జనార్దన్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. ఈకేసు విషయంలో ఆ అధికారికి సహకరించాలని ఇండుగుమిల్లి ప్రసాద్ కు కూడా వర్తమానం వచ్చింది. దీంతో ఇది కొన్ని పత్రికల్లో పతాక వార్త అయింది. జగన్ సర్కారును రాష్ట్రపతి స్వయంగా తప్పుబట్టినంత హడావిడి చేశారు.
ఇది రాష్ట్రపతి ఉత్తరువేనా?
కానే కాదు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వు కాదు. తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదును రాష్ట్రప్రభుత్వానికి బదలాయిస్తూ.. ఒక అధికారికి ఆ పని అప్పగిస్తూ వచ్చిన వర్తమానం మాత్రమే. దీనిమీద ఆ అధికారి ఏమైనా స్పందించి చర్య తీసుకుని.. మళ్లీ రాష్ట్రపతికి (తప్పనిసరిగా) రిపోర్టు చేయాలనే నిబంధన ఏమీ లేదు. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి.
జగన్ ప్రభుత్వంలో అధికారులు.. ఎలా పనిచేస్తున్నారో యోచించాలి. సెలక్ట్ కమిటీ ఏర్పాటు- దానికి బిల్లు పంపడం గురించి శాసనమండలి ఛైర్మన్ ఆదేశిస్తే.. అసెంబ్లీ కార్యదర్శి దానిని పట్టించుకోలేదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు ఆదేశిస్తే దానిని ఎన్నికల కమిషన్ అధికారి పట్టించుకోలేదు. ఎవరికి వారు- ఈ వ్యవస్థల ఆదేశాలను తిరస్కరిస్తూ వచ్చారు.
ప్రభుత్వాధికారుల పనితీరు అలా ఉన్నప్పుడు.. ‘ఆదేశం’ రూపంలో కూడా లేని రాష్ట్రపతి వర్తమానాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారని, దాని వలన ఘోరమైన అన్యాయానికి గురైన ఇండుగుమిల్లి ప్రసాద్ కు.. తక్షణం న్యాయం జరిగిపోతుందని అనుకోవడం పిచ్చి భ్రమ.
రాష్ట్రపతినుంచి వచ్చింది.. జీఏడీలోని జనార్దన్ బాబు.. దానిని స్వీకరించారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఏమైనా జరిగేట్లయితే ఈ పాటికి ఆ ఆనవాళ్లు కనిపించాలి కద. అలాంటివేమీ లేవు.
రాష్ట్రపతి నుంచి వచ్చింది ఏమిటి?
జగన్ సర్కారును రాష్ట్రపతి కూడా మందలించినంత అత్యుత్సాహంతో మీడియా ఈ ఎపిపోడ్ ను హైలైట్ చేసింది. నిజానికి అది ప్రసాద్ రాసిన లేఖకు అక్నాలెడ్జిమెంట్ మాత్రమే అనుకోవాలి. ఆ లేఖలోని వర్తమానం, తదనుగుణంగా వచ్చిన వార్తల్లోని సారాంశం గమనించినా కూడా.. అసిస్టెంట్ సెక్రటరా జనార్దనబాబు ఏమైనా చర్య తీసుకుంటే , వివరాలు అడిగితే ప్రసాద్ ఆయనకు సహకరించాలి. అంతే! సదరు అధికారి మిన్నకుండిపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే!
ప్రభుత్వం పరంగా ఈ అరాచకానికి కారకుడైన నాయకుడిపై చర్య తీసుకోవడం సంగతి తర్వాత.. కనీసం పార్టీ పరంగా కూడా మందలించినట్లయినా వార్తలు ఎక్కడా రాలేదు. అంటే అటు పార్టీ గానీ, ఇటు ప్రభుత్వం గానీ.. మా పద్దతిలో మేం నడుస్తాం. ఎవరేం అనుకుంటే మాకేంటి? అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ఒక వర్తమానం రాగానే, తప్పెవరిదో తేల్చి.. శిక్షలు పడేంత పరిణామాలు ఉంటాయని ఆశించడం అవివేకం.