నమస్కారం అనేది మన భారతీయుల సంస్కారం. ‘నమస్కారమండీ’ అంటూ మనం రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టగానే అవతలి వ్యక్తికీ మన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కు సంకేతం. బ్రిటీషువారు మన దేశంలో అడుగుపెట్టాక ‘హాయ్ హలో’ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం మనకు అలవాటైపోయింది. ఇప్పుడు కరోనా వచ్చాక… మళ్లీ రెండు చేతులూ జోడించి నమస్కరించక తప్పడం లేదు. ఇది కరోనా మనకు నేర్పిన గుణపాఠం అనుకోవాలి. అసలు ఈ నమస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో, ఇది ఎలా పుట్టిందో ఓ సారి తెలుసుకుందాం.
మన భారత ఉపఖండంలో పలకరింపు లేదా వందనం చేయాలంటే సాధారణంగా నమస్తే , నమస్కార్ లేదా నమస్కారం అనే పదాలను ఎక్కువగా వాడతారు. నమస్కార్‌ను నమస్తే కంటే కొద్దిగా ఎక్కువగా ఉపయోగిస్తారు, అయితే ఈ రెండు పదాలూ ఎక్కువ గౌరవ భావాన్ని తెలియజేసేందుకే వాడతారు. సాధారణంగా మనదేశం తోపాటు నేపాల్‌లలో హిందువులు, జైనులు, బౌద్ధులు కూడా ఈ మాటలు వాడతారు, భారత ఉపఖండం వెలుపల కూడా అనేక మంది దీనిని ఆచరిస్తున్నారు. యోగాలో నమస్తే అంటే “నాలోని వెలుగు నీలోని వెలుగును గౌరవిస్తుంది” అని అర్థమట. దీనిని యోగా గురువులు, యోగా విద్యార్థులు ఎక్కువగా పలుకుతుంటారు. నమస్తే అనే పదం సంస్కృతంలో నమస్ నుంచి పుట్టింది. మరో వ్యక్తితో మాట్లాడే సమయంలో, చేతులు రెండూ జోడించి, అరచేతులను కలిపి, వేళ్లను పైకిచూపుతూ, వాటిని ఛాతీకి ఎదురుగా ఉంచి, కొద్దిగా వంగి నమస్కరించడం సాధారణ ఆచారంగా పాటిస్తూ ఉంటారు. ఇంకా లోతుగా చెప్పాలంటే ప్రతి జీవిలోనూ ఆత్మ రూపంలో పరమాత్మ స్వరూపం ఉంటుంది. ఈ ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మను మనం నమస్కరించుకోవడం చాలా మంచిది. అహం బ్రహ్మస్మీ అనే మాటను మనం వింటుంటాం. శివోహం అనే మాట కూడా ఉంది. అంటే బ్రహ్మను నేనే, శివుడిని నేనే అని అర్థం. మనం నమస్కారం పెట్టామంటే ఎదుటి వ్యక్తిలోని పరమాత్మకు నమస్కరించినట్లేనని భావించాలి. మనల్ని మనం తగ్గించుకుంటేనే మన గౌరవం మరింత పెరుగుతుందని గమనించండి.











