భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, సుప్రీంకోర్టులపై ఆయన చేసిన ట్వీట్లు న్యాయ వ్వవస్థ ప్రతిష్టకు భంగంకలిగించాయని ప్రశాంత్ భూషణ్ కేసును సుప్రీం సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు తీసుకోవలసిన చర్యలపై ఈ నెల 20న తమ వాదనలు వింటామని పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా, బిఆర్ గవై, కృష్ణ మురారీలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
చీఫ్ జస్టిస్ బొబ్డే హెల్మెట్ ఎందుకు ధరించలేదని అడిగినందుకు చింతిస్తున్నానని..బైక్ స్టాండ్ లో బైక్ ఉందని గుర్తించి తాను క్షమాపణలు చెప్పినట్లు ప్రశాంత్ భూషణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. హెల్మట్ లేదని ప్రశ్నించడంలో భాగంగా తాను చేసిన ట్వీట్‌లో ఆ భాగానికి చింతిస్తున్నానని చెప్పారు. అయితే, నా ట్వీట్‌లోని మిగిలిన భాగానికి నేను అండగా నిలుస్తానని ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయమూర్తిపై తాను చేసిన విమర్శలు కోర్టును అపకీర్తి పాలు చేయవని అంతే గాకుండా దాని అధికారాన్ని తగ్గించవని ఆయన సుప్రీంకిచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో తమ తీర్పును వెలువరించిన కోర్టు ట్విట్టర్ పై నమోదయిన కోర్టు ధిక్కార కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. “ట్విట్టర్ ఇచ్చిన వివరణను మేము అంగీకరిస్తున్నాము. యూజర్స్ చేసే పోస్టులపై ట్విట్టర్ కు ఎటువంటి నియంత్రణ లేదు. ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను వెంటనే డిలీట్ చేసే విషయంలో ట్విట్టర్ వేగవంతంగా స్పందించింది” అంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు వాస్తవాలను వక్రీకరించడమే గాక నేరపూరిత ఆలోచనలతో చేసినట్లు అర్థమవుతోందని అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే న్యాయవ్యవస్థ పనితీరుపై ట్వీట్లు చేయడం పద్దతి కాదని హితువు పలికింది. 30 సంవత్సరాలు న్యాయవాదిగా పని చేసిన వ్యక్తి కోర్టుకు దురుద్దేశాలు ఆపాదిస్తారని ఊహించలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘ప్రజాస్వామ్యంలో భారత న్యాయవ్యవస్థ ఓ ప్రధాన పిల్లర్. ప్రజాస్వామ్యం యొక్క పునాదిని కదిలించే ప్రయత్నం జరుగుతున్న విషయంలో కఠినంగా వ్యవహరించాలి. న్యాయస్థానాలపై విమర్సలు చేస్తూ వాటిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసే చర్యలను ఎట్టి పరిస్థితులలో తాము అనుమతించబోమని’ సుప్రీం స్పష్టం చేసింది. తన వాక్ స్వాతంత్ర హక్కును వినియోగించుకొని కోర్టు పనితీరు గురించి తన అభిప్రాయాన్ని తెలియచేశానని ఇది న్యాయవ్యవస్థపై దురుద్దేశ పూర్వకంగా చేసిన వాటిగా పరిగణలోకి తీసుకోరాదని ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది.