ఉక్రెయిన్ యువతి శంషాబాద్ లోని హోటల్లో ఉండగా, ముగ్గురు యువకులు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై అత్యాచారానికి ప్రయత్నించిన ముగ్గురు యువకుల్లో ఒకడైన పురేందర్ కుమార్.. నంద్యాల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువనాయకుడు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అనుంగు అనుచరుడు. నంద్యాల మునిసిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి కౌన్సిలర్ గా బరిలో ఉన్నాడు. ఇప్పుడు శంషాబాద్ లో అత్యాచారానికి ప్రయత్నించి పోలీసుల చేతికి చిక్కాడు.
జగన్ చిత్తశుద్ధికి పరీక్ష
ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి చాలా దగ్గరి అనుచరుడు అని నంద్యాలకు చెందిన పలువురి ద్వారా తెలుస్తోంది. ఆ విషయం పురేందర్ కుమార్ ఫోటోలు గమనించినా అర్థవుతుంది. ముఖ్యమంత్రి జగన్ తో పురేందర్ కుమార్ సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. తమ సొంత పార్టీ యువనాయకుడు ఇలాంటి అసహ్యమైన కేసులో ఉన్నప్పుడు జగన్మోహనరెడ్డి ఎలా స్పందిస్తారనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న బెంగుళూరు యువతి , వందేభారత్ లో భాగంగా ప్రత్యేకవిమానంలో హైదరాబాదుకు వచ్చింది. బెంగుళూరు వెళ్లడానికి అనుమతి వచ్చేదాకా హోటల్లో రూం తీసుకుంది. ఒంటరి అమ్మాయిని గుర్తించి అత్యాచారానికి ప్రయత్నించిన ముగ్గురిలో పురేందర్ ఒకడు. ఇలాంటి పశుప్రవృత్తి ఉన్న వాళ్లని ప్రజానాయకులుగా ప్రోత్సహిస్తున్న వైఖరి మీదనే ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి.
పురేందర్ ను పార్టీనుంచి వెలివేసినంత మాత్రాన చాలదని, కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తేనే అమ్మాయిలకు రక్షణ కల్పించడం పట్ల జగన్ చిత్తశుద్ధి నిలబెట్టుకున్నట్టు ఉంటుందని పలువురు అంటున్నారు.
దిశ చట్టం ఎవరికోసం..?
హైదరాబాదులో ఒక అమ్మాయి అన్యాయానికి గురైతే అమరావతిలో జగన్మోహన రెడ్డి స్పందించి రూపొందించిన కొత్త చట్టం విషయంలో ఆయనను అందరూ వేనేఝళ్ల పొగిడారు. అమ్మాయి రక్షణ పట్ల ఆయన కమిటెడ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్మోహనరెడ్డి అమ్మాయిల రక్షణకోసం అద్భుతమైన తీరులో దిశచట్టం తయారైంది. కాలయాపన లేకుండా సత్వర శిక్షలు పడేలా.. ఇందులో నిబంధనలు విధించారు. అమ్మాయిలపై ఏ రకమైన వేధింపులకైనా ఈ చట్టం కింద శిక్షలు తప్పవు.
వైకాపా నేతలకు సంబంధించి.. మహిళా నేతలపై చిన్న చిన్న పోస్టులు వచ్చినా వెంటనే కేసులు నమోదు చేసిన పోలీసులు.. తెలుగుదేశానికి చెందిన మహిళా నాయకురాళ్ల మీద అసభ్యమైన పోస్టులు పెట్టినప్పుడు, అసభ్యంగా స్పందించినప్పుడు కేసులు పెట్టడానికి వెళ్తే కనీసం కేసులు నమోదు కూడా చేసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో తెదేపా మహిళా నాయకురాళ్లు గతంలో అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు సొంత పార్టీ యువనాయకుడే హేయమైన కేసులో ఇరుక్కున్నాడు. మరి జగన్ ఏం చేస్తారనేది వేచిచూడాలి.










