సినిమాలకు కథలు లేకపోతే ఏమీ బాధపడాల్సిన పనిలేదు…. మన రాంగోపాల్ వర్మ ఉండనే ఉన్నారు. కథలు ఆయనకు ఎలాగైతే దొరుకుతున్నాయో, ఆయనపైన కూడా బోలెడు కథలు దొరకుతున్నాయి. రాడ్ గోపాల్ వర్మ, పరాన్నజీవి, ఆర్టీవీ (రోజూ గిల్లేవాడు) ఇలా ఎన్నో… ఇప్పుడు ఆ కోవలోకే ‘రాంగ్ గోపాల్ వర్మ’ సినిమా చేరింది. వర్మ రాంగ్ డైరెక్షన్ లో వెళుతుండటమే ఈ సినిమా నిర్మాణానికి కారణమని తెలుస్తోంది. ఆయనపై ఎక్కుపెట్టేందుకు ఇది మరో అస్ర్తంగా భావించాలి. ఇందులో కూడా షకలక శంకరే రాంగోపాల్ వర్మగా నటించడం విశేషం.
జర్నలిస్టు ప్రభు నిర్మాణం, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది. దీని ఫస్ట్ లుక్ గురువారం విడుదల కాబోతోందని అంటున్నారు. ఏ రైట్ డైరెక్టర్ ఇన్ రాంగ్ డైరెక్షర్ అనే కాన్సెప్ట్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. తన మనుగడ కోసం కావాలని వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ఓ దర్శకుడి కథగా ఇది తెరకెక్కింది. ఇందులో షకలక శంకర్ తో పాటు కత్తి మహేష్, జబర్దస్త్ అభి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పౌరహక్కుల నేత దేవి చేతుల మీదుగా పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఓటీటీ లేదా ఏటీటీలో ఈ సినిమాని విడుదల చేయటానికి జోరుగా ప్రయత్నలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభు ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం రాంగోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా తీయడమేనని తెలుస్తోంది. ‘ఎవరిమీద పడితే వారి మీద వెటకారాలు చేయడం, బూతు సినిమాలు తీయడం, నోటికొచ్చినట్లు వాగడం… వీటన్నిటి మీద అతనికి ఎలాంటి అభిప్రాయం ఉందో తనకు కూడా అలాంటి అభిప్రాయమే ఉందం’టున్నారు ప్రభు. అందరి మీదా వెటకారాలు చేయడానికి అతనికి ఎలాంటి హక్కు ఉందో తనకూ కూడా అలాంటి హక్కే ఉందనేది ప్రభు వాదన. ముఖ్యంగా హిందూ దేవుళ్ల మీద ఇష్టమొచ్చినట్లు వాగడం కూడా తనకు నచ్చలేదని ప్రభు వ్యాఖ్యానించారు.











