గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు. పల్నాటి పులిగా పేరుగాంచిన టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మరణంతో సత్తెనపల్లి టీడీపీలో నైరాశ్యం అలుముకుంది. కోడెల కుమారుడు శివరాం అప్పుడప్పుడూ సత్తెనపల్లి వచ్చిపోవడం తప్ప టీడీపీని ముందుండి నిడిపించింది లేదు.
తెలుగుదేశం పార్టీ ఇంత వరకూ కమిటీలు వేయలేదు, నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను కూడా నియమించుకోలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిన అభ్యర్ధులే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇక సత్తెనపల్లి నుంచి 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కోడెల మరణంతో అక్కడ టీడీపీని నడిపించే నాయకులే లేకుండా పోయారు.
కోడెల శివరాంకు బాధ్యతలు అప్పగిస్తారా?
మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరాంపై సత్తెనపల్లి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయం టీడీపీ అధినేతకు కూడా తెలుసు. అయితే తండ్రి మరణించిన తరవాత శివరాంకు పార్టీ అండగా నిలుస్తూ వస్తోంది. సత్తెనపల్లి పార్టీ బాధ్యతలు కోడెల శివరాంకు ఇవ్వకుండా మరో నేతను దింపితే, కోడెల ఫ్యామిలీని పార్టీ నిర్లక్ష్యం చేస్తుందనే సంకేతాలు వస్తాయనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నట్టు సమాచారం. అందుకే అటు కోడెల శివరాం పేరుగానీ, మరోనేత పేరుగానీ ఇంత వరకు ప్రకటించలేదు.
రాయపాటి రంగారావుకు అవకాశం ఉందా?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరినప్పటి నుంచీ ఆయన కుమారుడు రంగారావు పార్టీలో చురుగ్గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ ఆశించారు. చివరి వరకూ టికెట్ కోసం ప్రయత్నాలు సాగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్ఠానం కోడెలకు సీటు ఇచ్చింది. నియోజకవర్గంలో కోడెల కుమారుడు శివరాం అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా చంద్రబాబునాయుడు వారి కుటుంబానికే టికెట్ కట్టబెట్టారు.
2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. ఆ తరవాత జరిగిన పరిణామాలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల చనిపోయి సంవత్సరం అవుతోంది. సత్తెనపల్లి టీడీపీకి పెద్దదిక్కు లేకుండా పోయింది.
వంగవీటి రాధాసత్తెనపల్లి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా?
2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కాపు సామాజికవర్గం నేత అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలోని రాజుపాలెం, ముప్పాళ్ల మండలాల్లో కాపు సామాజికవర్గం అధికంగా ఉన్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలోనే 45 వేల కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. అంటే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కాపు ఓట్లు చాలా కీలకం.
అందుకే సత్తెనపల్లిలో టీడీపీ బాధ్యతలు కాపు నేతకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై కూడా టీడీపీ రహస్యంగా ఓ సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో విజయవాడ కాపు నేత వంగవీటి రాధాకు సత్తెనపల్లి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నలు సంధించారు. దీనిపై కాపు సామాజికవర్గం సానుకూలంగా స్పందించిదని సమాచారం. అయితే వంగవీటి రాధా సత్తెనపల్లికి నాన్ లోకల్ కావడం పెద్ద మైనస్ అని తేలింది.
తెలుగుయువత మల్లికి అవకాశం ఇస్తారా?
గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడిగా పనిచేసిన మల్లిఖార్జునరావు సత్తెనపల్లి నియోజకవర్గంపై కన్నేశారు. అతను సత్తెనపల్లి నియోజకవర్గానికి స్థానికుడు కావడం కలసి వచ్చేలా ఉంది. అయితే సత్తెనపల్లిలో అంబటిని తట్టుకుని నిలబడాలంటే మల్లిఖార్జునరావు వల్ల కాదని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే సత్తెనపల్లి నియోజకవర్గానికి బలమైన నేత కోసం టీడీపీ గాలిస్తోందని తెలుస్తోంది. ఏదీ ఏమైనా సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడుగా ఎవరు వస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.











