ఓ పాత సినిమాలో ఓ పాట ఉంది ‘చవటాయను నేను..నీకంటే పెద్ద చవటాయను నేను’ అంటూ ఒకరికొకరు పోటీ పడుతుంటారు. దానికి కారణం ఎవరు పెద్ద చవట అయితే నేను వారినే ప్రేమిస్తాను అని హీరోయిన్ అంటుంది.. అందుకుని వారు అందులో పోటీ పడ్డారు. బిగ్ బాస్ 4 షో అందుకు విరుద్దం. ఇక్కడ గెలవాలంటే ఇంకొకరిని బయటకు తోసేయాలి. ‘నీకంటే నేనే పెద్ద తోపు’ అనటమే కాదు అలా నిరూపించుకోవాలి కూడా. ఈ షో ముగింపునకు వచ్చేసింది. విజేత ఎవరో ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది కూడా. కాకపోతే ఓటమిని అంత త్వరగా ఎవరూ ఒప్పుకోరు.. దింపుడు కళ్లెం ఆశ.. అంటారే అలాంటిదే ఇది కూడా.
పంచపాండవుల్లో ఆ ఒక్కరు ఎవరు?
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు అభిజిత్, అఖిల్, అరియానా, హారిక, సోహైల్ మాత్రమే ఉన్నారు. మన చేతికున్న ఐదు వేళ్లూ ఒక్కలా ఉండనట్టే వీరు కూడా. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా వ్యక్తిత్వం. ముఖ్యంగా ‘అ అ అ’ల గురించి మాట్లాడుకోవాలి. అ అ అ.. అఆ సినిమా మాదిరిగా ఇదేదో వింతగానే ఉందే. పక్క పక్కనే ఉన్న రెండక్షరాలు కలుసుకోడానికి ఎన్నేళ్లు పట్టిందోగానీ ఈ మూడక్షరాలూ మాత్రం పక్క పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ మాదిరిగా ఈ ‘అ’ ఏమిటో అర్థం కాక జుట్టు పీక్కో వద్దు. అభిజిత్, అఖిల్, అరియానా.. ఈ మూడక్షరాల గోల ఇది. ఎవరిగోల వారిదో అనుకుంటే సరిపోదు.. బిగ్ బాస్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న పేర్లు ఇవే. బిగ్ బాస్ 4 విజేతగా తీర్పు రావడానికి మరో మూడు రోజులే టైమ్ ఉంది.
ఇక విషయంలోకి వస్తే ఈ ముగ్గురివీ మూడు దారులు. అందరి మనసుల్నీ అభిజిత్ చూరగొంటే ఎలాగైనా సరే అభిజిత్ ను దాటుకుని ముందుకు వెళ్లాలని మిగతా ఇద్దరూ తాపత్రయ పడుతున్నారు. అఖిల్ కు తనకు కావలసిన దాన్ని ఎలా సాధించుకోవాలో బాగా తెలుసు. ఇక మిగతా రెండు ‘అ’లకు గాడ్ ఫాదర్, గాడ్ మదర్ లు ఉన్నారన్న ప్రచారం ఉంది. నువ్వు నీలా ఉండటానికి ప్రయత్నిస్తేనే జనం నిన్ను ఓన్ చేసుకుంటారు అనడానికి ఉదాహరణ అభిజిత్. అఖిల్ యాటిట్యూడ్.. ‘ఇక విన్నర్ నేనే’ అన్నట్లుంది.. టాస్క్ లు బాగానే ఆడతాడు.. ఫిజికల్ టాస్క్ లు ఆడతాడు.. బ్రెయిన్ గేమ్ ల విషయంలో వీక్.. తను తనలానే ఉంటూ అభిజిత్ అందరి మీదా పైచేయి సాధించేశాడు.
ఆ గాడ్ ఫాదర్, గాడ్ మదర్ ఎవరు?
మన బిగ్ బాస్ 4కి విన్నర్ ఎవరన్నదాని మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ చెప్పే పేరు అభిజిత్ మాత్రమే. ఒకవిధంగా జనం ఏకాభిప్రాయం ఇది. ఆ విషయాన్ని అలా పక్కన పెడితే అభిజిత్ వెనక ఓ గాడ్ మదర్ ఉందన్న ప్రచారం సాగింది. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సతీమణి అక్కినేని అమల. మధ్యలో అమల పేరెందుకు వచ్చిందన్న అనుమానం కూడా వచ్చింది. అభిజిత్ హీరోగా నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అతని తల్లిగా అమల నటించడమే కారణం అనే ప్రచారం సాగింది.
అమల సిఫార్సుతో అభిజిత్ విజేతగా నిలుస్తాడనేది ప్రచారం. వాస్తవానికి అభిజిత్ తన టాలెంట్ తో మాత్రమే ఈ స్థాయిలో నిలవగలిగాడన్నది జగమెరిగిన సత్యం. మరి గాడ్ ఫాదర్ ఎవరు? ఇది అరియానాకు సంబంధించిన అంశం. రామ్ గోపాల్ వర్మ కారణంగానే అరియానా ఇంతక్రేజ్ సంపాదించుకుందన్న ప్రచారం ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ మాటలు ఆమె విషయంలో ఓ టానిక్ లానే పనిచేశాయి.
ఒకవేళ అరియానా రన్నర్ గా నిలిచినా అంతో ఇంతో రామ్ గోపాల్ వర్మ పుణ్యమేనని అనుకోవాలేమో. రామ్ గోపాల్ వర్మతో హోస్ట్ నాగార్జునకు ఎంత సాన్నిహిత్యం ఉన్నా అది విజేతను నిర్ణయంచే విషయంలో ఏ మాత్రమూ ప్రభావితం చేయలేదని అనుకోవచ్చు. అందువల్ల ఈ గాడ్ ఫాదర్, గాడ్ మదర్ కాన్సెప్ట్ కూడా రాంగే. ఇది కేవలం గేమ్ షో.. ఎవరికి సత్తా ఉందో జనానికి తెలుసు. విజేత విషయంలో జానాభిప్రాయానికి భిన్నంగా బిగాబాస్ వెళ్లడనే అనుకోవాలి. అందుకే బిగ్ బాసే విజేతకు గాడ్ ఫాదర్.











