భారత మాజీ ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పీ.వీ నరసింహారావు చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానంతో పాటు ఆయన శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పేరును పీవీ జ్ఞాన మార్గ్ గా నామకరణం చేస్తామని, పీవీ మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణా అస్తిత్వ వాదానికి పీవీ నరసింహారావు ప్రతీక అని, దాన్ని ప్రపంచ దేశాలకు చాటుతామని ఆయన తెలిపారు. “మన పీవీ, నరసింహారావు గొప్ప సంస్కరణలను తీసుకువచ్చిన సంస్కర్త. ఆయనను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది“ అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు.
శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి… ప్రధాని
మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్, ప్రధాని నరేంద్ర మోడీలను ఆహ్వనిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వారితో పాటు దేశంలోని అన్ని రాఫ్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తామని ప్రకటించారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లోని పెద్ద వారిని, మత గురువులను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. “పీ.వీ.నరసింహారావు విగ్రహాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేస్తాం“ అని ప్రకటించారు.
పీవీ జన్మస్ధలం ఇక పర్యాటక కేంద్రం
మాజీ ప్రధాని పీ.వీ.నర్శింహారావు స్వగ్రామాలైన లక్నేపల్లి, వంగరలలో పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని సీఎం కే.చంద్రశేఖర రావు ప్రకటించారు. పర్యాటక కేంద్రాలుగా ప్రకటించిన ప్రాంతాలలో పీ.వీ.నర్శింహారావు స్మారక చిహ్నాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. సెంట్రల్ యూనివర్శీటీకి మాజీ ప్రధాని పీ.వీ.నర్శింహారావు పేరు పెట్టాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
డిఫెన్స్ లో కాంగ్రెస్
పీ.వీ. నర్సింహారావు ఖ్యాతిని నలుదిశలా వెలిగిపోయేలా చేస్తామంటూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చేసిన ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. మాజీ ప్రధాని పీవీ మరణానంతంరం కాంగ్రెస్ అధిష్టానం ప్రవర్తించిన తీరుతో ఆయన అభిమానులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆ తప్పును దిద్దుకునే చర్యల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి… సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇబ్బందిగా మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉన్న పాత తరం వారంతా ఇప్పుడు కేసీఆర్ వైపు మళ్లడం ఖాయమని వారి అభిప్రాయం. అలాగే తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సమాజం కూడా తమవాడైన పీ.వీ.నర్సింహారావు పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి ఫిదా అవడం ఖాయమని అంటున్నారు. పీ.వీ.నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు కూడా రాజకీయంగా కీలక మలుపులు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.