కరోనా ఆంక్షల వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా భారీ ప్రచార సభలు, ప్రదర్శనలు నిర్వహించలేని స్థితి. నాయకులు ఓటర్ల వద్దకు వెళ్లి ఆశీస్సులు కోరడానికీ వీల్లేకుండా పోయింది. అయినప్పటికీ బిహార్ లో అక్టోబరు, నవంబరుల్లో అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. పాలక జనతాదళ్ (యు)-భారతీయ జనతా పార్టీలే కాకుండా ప్రతిపక్షాలూ రాష్ట్రంలో తమ హవాయే వీస్తోందని ధీమా కనబరుస్తున్నారు. మరి ఏయే అంశాలు తమను గెలిపిస్తాయని అవి నమ్ముతున్నాయి ? బిహార్ స్థితిగతులను విహంగ వీక్షణం చేస్తే కనిపించే ప్రధానాంశాలు ఇవి: కరోనా లాక్ డౌన్ వల్ల దేశమంతటి నుంచీ స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన బిహారీ వలస కూలీల కడగండ్లు; లాక్ డౌన్ వల్ల క్షీణించిన బిహార్ ఆర్థిక వ్యవస్థ; కొవిడ్ 19ను, వరదలను సమర్థంగా నిభాయించడంలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం; బిహార్ కు చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్య. వీటన్నింటినీ మించి బిహార్ ఎన్నికలను శాసించేది కులమా లేక వికాసమా అనే ప్రశ్న ఉండనే ఉంది. ఏ ఎన్నికలోనైనా గెలవాలంటే పార్టీ ప్రధాన సారథుల సమ్మోహన శక్తి, మిత్రపక్షాలతో కలసి పోటీచేస్తే కూటమి సంఘటిత శక్తి కీలకంగా నిలుస్తాయి. నాయకత్వం విషయంలో పాలక ఎన్డీయేకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు ప్రధాన ఆకర్షణలుగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పెద్ద దిక్కు లాలూ ప్రసాద్ యాదవ్ పశు గ్రాసం కేసులో జైలులో ఉన్నారు. ఆయన అక్కడ 2017 నుంచి 27.5 సంవత్సరాలు ఉండబోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో లాలూ బొమ్మతో బరిలో దిగడానికి ఆర్జేడీ సాహసం చేయలేకపోతోంది. లాలూతోపాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవిపైనా అవినీతి మరక ఉండటంతో, వారి కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖచిత్రంతోనే ఆర్జేడీ ఎన్నికల పోరులోకి దిగింది. మరోవైపు అధికార జెడీ (యు) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీల చిత్రాలు ముద్రించిన ఎన్నికల పోస్టర్లను రాష్ట్రమంతటా అతికిస్తూ ఉత్సాహంగా ముందుకెళుతోంది. 2005-13 మధ్య నితీశ్ ఎన్డీయేలో ఉండి కూడా మోదీతో వేదిక పంచుకోవడానికి ఇష్టపడేవారు కారు. తీరా ఇప్పుడు ఉభయులూ పోస్టర్లలో జతకలిశారు. ఎంతలో ఎంత మార్పు!
243 సీట్లు గల బిహార్ అసెంబ్లీలో పాలక, ప్రతిపక్ష కూటముల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. జెడీ(యు). భాజపా భాగస్వాములుగా ఉన్న ఎన్డీయే కూటమిలో 51సీట్లపై పీటముడి పడవచ్చని అంచనా. రాం విలాస్ పాసవాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్.జె.పి) ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ రంగంలోకి దిగుతోంది. ఎల్.జె.పి కేంద్రంలో ఎన్డీయే భాగస్వామి అయినా, బిహార్ లో నితీశ్ కుమార్ తో తెగతెంపులు చేసుకుంది. మరి జెడి(యు), ఎల్.జె.పిల మధ్య భాజపా సయోధ్య కుదర్చగలదా అన్నది చూడాలి.
ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కూడిన మహాఘట్ బంధన్ ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు. కమ్యూనిస్టు పార్టీలు లాంఛనంగా ఈ కూటమిలో చేరవలసి ఉంది. రాష్ట్ర జనాభాలో 14 శాతం ఆక్రమిస్తున్న యాదవ ఓటర్లు, 17 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు ఆర్జేడీకి పెట్టని కోటలు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత కులమైన కుర్మీలు 2 శాతమే ఉన్నారు. 16 శాతం దళిత ఓటర్లనూ ఆకట్టుకోగలరు కానీ, ఎల్.జి.పి ఈ ఓట్లకు గండి కొట్టకుండా చూసుకోవాలి. అప్పటికీ జెడి(యు)కు అదనపు బలం కావలసి వస్తుంది. ఇక్కడ భాజపా ఓటర్లు, నరేంద్ర మోదీ ఇమేజ్ అక్కరకొస్తాయి.
కాకలు తీరిన నితీశ్-మోదీ ద్వయానికి కుర్రవాడైన తేజస్వీ యాదవ్ గట్టి పోటీ ఇవ్వలేకపోయినా వరదలు, కొవిడ్ నిభాయింపులో వైఫల్యం, నిరుద్యోగం సరైన ప్రత్యర్థులుగా నిలచి తమను గెలిపిస్తాయని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బిహార్ లో వ్యతిరేక గాలి వీస్తోందని నమ్ముతున్నాయి. ఆర్జేడీ అవినీతి చరిత్ర గాలిని అటు మళ్లనివ్వకుండా తమవైపే నిలుపుతుందని ఎన్డీయే భావిస్తోంది. మొత్తానికి బిహార్ లో పోటీ రసవత్తరంగా ఉండి, భావి జాతీయ రాజకీయాలనూ ప్రభావితం చేయబోతోంది.
– అర్జున్











