(అనంతపురం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ప్రస్తుతానికి ఏదో కొవిడ్ తో సతమతం అవుతున్నారు గనుక.. చికిత్స తీసుకుంటున్నారు గనుక.. జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త సేఫ్ జోన్ లో ఉన్నట్లు లెక్క. కరోనా ఉపశమించిందంటే.. మళ్లీ హఠాత్తుగా పోలీసులకు మరొక కేసు గుర్తుకొస్తుదో ఏమో చెప్పలేని పరిస్థితి.
అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ సోదరులు ఏది చేసినా సంచలనమే. ప్రభుత్వాలు ఎన్ని మారినా తగ్గని ఆధిపత్యం, కార్యకర్తల్లో చెక్కుచెదరని నాయకత్వం జేసీ కుటుంబానికి సొంతం. సొంతపార్టీనే లెక్కచేయక దూసుకు పోయిన నాయకత్వం. తాడిపత్రిలో ఎదురులేని నాయకత్వం, జిల్లా వ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక వర్గం వారికున్న బలం. ఫలితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనూ వారి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించలేదు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులు తిరగబడ్డాయనే అనిపిస్తోంది. అత్యధిక స్థానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులెవరూ మాట్లాడని స్థాయిలో జేసీ సోదరులు స్వరం పెంచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వారి ఆధిపత్య కొనసాగింపుకు కళ్లెం వేసేలా అధికార పార్టీ దృష్టి సారించిందనటానికి వరుస అరెస్టులే ఉదాహరణగా జనం చెప్పుకుంటున్నారు.
బీఎస్3 వాహనాలను బీఎస్4గా రిజర్వేషన్ చేయించారన్న అంశం, పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు, కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయటం తెలిసిందే. ఇలాంటి అరెస్టులు భవిష్యత్తులోనూ ఆగవేమోనని జేసీ అనుచర వర్గంలో అలజడి మొదలైనట్లు జనంలో చర్చ నడుస్తోంది.
ఆధిపత్యం చెలాయించే ఒక్కరిని అణచివేస్తే అంతా అనుకూలమన్నదే అధికారం ఆలోచనగా ప్రజలు భావిస్తున్నారు! ఇది ప్రస్తుతం జనంలో చర్చనీయాంశమైంది. అంతేగాక గతం నుంచి కొనసాగిస్తున్న ఆధిపత్యంపై పెత్తనం చేయాలనా? అంతకు మించి మరేదైనా ఉందా అన్నదే జిల్లాలో సర్వత్రా నెలకొన్న రాజకీయ చర్చనీయాంశంగా ఉంది.
కేవలం దూషణలే కారణం కాదు
‘‘ఏమో రేపు నన్నుకూడా అరెస్టు చేయొచ్చు.. ఎవురికి తెలుసు.. ఆయన ఏమైనా చేస్తారు.. ఆయనకి జనం మెజార్టీ ఇచ్చారు’’ అని- రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి అనంతపురం జిల్లా రాజకీయాల్లో- ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదనే అంశంతో నిమిత్తం లేకుండా కొన్ని దశాబ్దాలపాటు అప్రతిహతంగా చక్రం తిప్పిన జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో ఆక్రోశం వెళ్లగక్కారంటే దాని వెనుక చాలా మర్మం ఉంది. జేసీ సోదరులు గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా.. జగన్ మీద ఒంటికాలిపై లేశారు. జగన్మోహనరెడ్డిని బహిరంగంగా దూషించారు. రాయలేని పదజాలంతోనూ తిట్టారు.
సాధారణంగా రాజకీయ నాయకులు చాలామంది ఇలాంటి భాషను అలవాటుగా వాడుతుంటారు. కానీ, రోడ్డు మీద ప్రదర్శనలు చేసే సమయంలో.. మీడియా కళ్లు కనిపెట్టి ఉన్నప్పుడు కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటారు. కానీ అలాంటిదేమీ లేకుండా జేసీ సోదరులు గతంలో విరుచుకుపడడం జరిగింది. అప్పటి మాటలను మనసులో పెట్టుకుని జగన్ ఇప్పుడు కక్ష సాధిస్తున్నారా? అనే సందేహాలు కొంత వరకు ప్రజల్లో ఉన్నాయి.
అదొక్కటే కారణం కాదు
కేవలం దూషణల వల్లనే జగన్ ఈ స్థాయిలో ప్రభాకర్ రెడ్డి లేదా జేసీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారంటే కొందరికి నమ్మశక్యంగా లేదు. స్థానిక నాయకుల్లో భిన్న కారణాలు వినిపిస్తున్నాయి. జేసీ సోదరులకు జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతినియోజకవర్గంలోనూ పట్టుంది. వారి హవా కొంత వరకు నడుస్తుంది. వారిని దెబ్బతీయగలిగితే.. మొత్తం జిల్లా మీదనే అపారమైన పట్టు దొరుకుందనేది వైకాపా వ్యూహం కావచ్చు. ఆ దిశగా వారు 2019 ఎన్నికల సమయంలోనే చాలా వరకు విజయం సాధించారు. శత్రుబలంలో శేషం మిగిల్చకూడదనే వ్యూహంతోనే.. విజయం తర్వాత కూడా జేసీ ఫ్యామిలీ మీద ఫోకస్ తగ్గించలేదని అనుకుంటున్నారు.