ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి సంబంధించిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ను విడుదల చేసి అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేశాడు జక్కన్న. టీజర్ విడుదలైన నిమిషాల వ్యవధిలో లక్షలాది వ్యూస్ వచ్చిపడ్డాయి. తెలంగాణా మన్యం వీరుడిగా పేరు తెచ్చుకున్న కొమరం భీమ్ పాత్రలో యన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించి సింహం లా గర్జించాడు. రామ్ చరణ్ బేస్ వాయిస్.. ఆ టీజర్ కు మంచి వెయిట్ తెచ్చిపెట్టింది. తను తీసే ప్రతీ సినిమా విషయంలోనూ ప్రేక్షకులకు ఆసక్తికరమైన రీతిలో షాకులివ్వడం రాజమౌళికి అలవాటు. ఈ సినిమాలో కూడా యాజ్ యూజువల్ గా ఒక పాయింట్ దగ్గర రాజమౌళి జనాన్ని కన్ఫ్యూజన్ లో ముంచెత్తాడు.
‘ఆర్.ఆర్.ఆర్’.. రామరాజు ఫర్ భీమ్ టీజర్ చివరిలో యన్టీఆర్ నెత్తిన టోపీతో కనిపిస్తాడు. నిజానికి కొమరం భీమ్.. స్వతంత్ర్యానికి పూర్వం నిజామ్ పాలకుల నిరంకుశత్వంపై, రజాకార్ల అరాచకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. అలాంటప్పుడు అతడి నెత్తిమీద టోపీ పెట్టి.. అతడ్ని ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే యువకుడిలా రాజమౌళి ఎందుకు చూపించాడు? ఈ సినిమాతో ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నాడని కొందరు ఈ టీజర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు లేవనెత్తుతున్నారు. అయితే జక్కన్న ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని, యన్టీఆర్ ఆ టోపీ ధరించడానికి వెనుక ఏదో ఆసక్తికరమైన అంశమే ఉండి ఉంటుందని కొందరు అభిమానులు ఆయన్ని వెనకేసుకు వస్తున్నారు. మరి జక్కన్న ఆ విషయంలో పొరపాటు ఎందుకు చేస్తాడు? అని విమర్శకులు ప్రశ్నించుకోవాలి. ఇంతకీ రాజమౌళి యన్టీఆర్ నెత్తి మీద టోపీ ఎందుకు పెట్టాడో తెలియాలంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.











