ఏపీలో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. హిందూ దేవాలయాలపై ఈగవాలితే రెచ్చిపోయే బీజేపీ నేతలు ఏపీలో మాత్రం నోరుమెదపడం లేదు. కళ్ల ముందే ప్రముఖ దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, కొందరు స్వామీజీలు మైనముద్రలోకి జారుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఏపీలో ప్రతి వారం ఏదో ఒక మూల హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు తెలియనట్టే వ్యవహరించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇక ఏపీ బీజేపీ నేతల తీరుతో ఆ పార్టీకి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయే ప్రమాదం ఉందని బీజేపీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అయినా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు మార్చుకోవడం లేదు.
దేవాలయాల ధ్వంసం సోముకు కనిపించడం లేదా?
ఏపీలో దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నోరుమెదపడం లేదు. అసలు సోము సోయిలో ఉన్నాడా లేడా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా హిందూదేవాలయాలపై దాడులు జరిగితే బీజేపీ నేతలు మైలేజీ పెంచుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తారు. ఏపీలో మాత్రం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంతసేపూ ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించడానికే శక్తినంతా ఉపయోగిస్తున్నారు. ప్రతిపక్షనేతలను తిడితే ఏం ప్రయోజనం దక్కుతుంది. అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలు,దాడులు, ధ్వంసాలను ప్రశ్నిస్తేనే ప్రజల్లో బీజేపీపై సానుభూతి పెరుగుతుంది. కానీ ఏపీ బీజేపీ అధినేత సోము వీర్రాజుకు మాత్రం నిద్రలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే కనిపిస్తూ ఉంటాడనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీలో ప్రముఖ దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రమాల ధ్వంసం జరుగుతుంటే బీజేపీ అధినేత ఎంత అలర్ట్ గా ఉండాలి. దేవాలయాలపై ఏపీ ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోయినా సోముకు చీమకుట్టినట్టు అనిపించడం లేదని వీహెచ్ పీ నేతలు గుర్రుగా ఉన్నారు. వైసీపీకి సోము అమ్ముడుపోయారని వారు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో బీజేపీ నేతలు కనీసం వార్డు మెంబరుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదనే విశ్లేషణలు సాగుతున్నాయి.
అనుకోని అతిథి
ఇక ఏపీ బీజేపీలో పెద్ద నేతలు ఉన్నా, ఓట్లు రాల్చే వారు ఒక్కరు కూడా లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యే వరకు జీవీఎల్ నరసింహారావు ఏ కొద్ది మంది పాత్రికేయులకు మాత్రమే తెలుసు. ఇక ఆయన ఎంపీ అయినప్పటి నుంచి చంద్రబాబును విమర్శించడమే విధిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అధికారం కోల్పోయినా జీవీఎల్ ఇంకా విమర్శల తీరు మార్చుకోలేదని ఆయన మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఎంత సేపటికీ టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై విమర్శలు చేయడమే కాని ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న సోయి కూడా జీవీఎల్ కు ఉన్నట్టు లేదనే విమర్శలు వస్తున్నారు.
ఏపీలో దేవాలయాలపై ఇన్ని దాడులు జరిగినా జీవీఎల్, ఒక్క ధ్వంసమైన దేవాలయాన్ని సందర్శించిన సందర్బం లేదు. ఇవన్నీ పరిశీలిస్తుంటే వైసీపీ, బీజేపీ నేతలు చాలా చక్కగా కలసి సమన్వయంతో పనిచేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తోంది.
హిందూ ధర్మరక్షకులు ఎక్కడ
హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో పీఠాలు ఏర్పాటు చేసుకుని వందల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్న స్వాములు కూడా పార్టీల వారీగా విడిపోయారనిపిస్తోంది. వైసీపీలో శారదాపీఠాధిపతి సర్వరూపానందేంద్ర సరస్వతి ఏది చెబితే అది జరుగుతుందని ప్రచారంలో ఉంది. అంటే ఆయన వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఎంత పట్టు సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీలో దేవాలయాలపై నిత్యం దాడులు జరుగుతున్నా స్వామి వారికి ఇవేమీ పట్టడం లేదు.
అంటే అధికారంలో ఉన్న వారితో అంటకాగుతూ ప్రభుత్వ తీరును తప్పుపడతారని ఎలా భావిస్తాం. అందుకే అటు బీజేపీ నేతలు, ఇటు స్వామీజీలు వైసీపీలో చేరిపోయినట్టే వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయాల ధ్వంసంపై సీబీఐ దర్యాప్తు చేయాలని వీహెచ్ పీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధినేత సోము వీర్రాజుకు మాత్రం దేవాలయాలపై దాడులు కనిపించకపోవడం శోచనీయం.